ఇంకా మేల్కోలే..! | no response on R and B Department | Sakshi
Sakshi News home page

ఇంకా మేల్కోలే..!

Published Mon, Dec 23 2013 2:47 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

no response on R and B Department

సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో ఘోర ప్రమాదాలు జరిగినా ఆర్‌అండ్‌బీ అధికారులు కళ్లు తెరవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. అయినా ప్యాచ్ వర్కులు లేవు. పెను ప్రమాదాలు జరిగిన చోట కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. లోతువాగు వద్ద రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెంది ఏడాది అయినా నేటికీ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా ఆయా అధికారులు నిద్రావస్థలో ఉన్నారు.గత ఏడాది డిసెంబర్ 23న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన రెండు కుటుం బాలకు చెందిన 11 మంది దుమ్ముగూడెం వెళ్తూ కొత్తగూడెం మండలం లోతువాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రోడ్డుపై పోసిన కంకర కుప్పును తప్పించబోయిన టిప్పర్ అతివేగంగా ఆటోను ఢీ కొట్టడంతో వీరు మృతి చెందారు. ప్యాచ్ వర్క్‌లు చేయకుండా రోడ్డుపై పోసిన కంకర కుప్ప వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన అధికారులు కాంట్రాక్టర్‌పై నామమాత్రపు కేసు పెట్టి వదిలేశారు.
 
 ఇంత భారీ ప్రమాదం జరిగినా సంబంధిత అధికారులు ఇప్పటికీ కళ్లు తెరవకపోవడం శోచనీయం. లోతువాగు వద్ద ఇంకా రోడ్డు అధ్వానంగానే ఉంది. ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో తరచూ ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. అంతేకుండా ఇటీవల కురిసన వర్షాలతో కొత్తగూడెం క్రాస్ రోడ్డు ఇరువైపులా కోతకు గురైనా కనీసం ఈ రోడ్డు పక్కన మట్టి కూడా పోయించలేదు. 2012 మార్చి 21న కొత్తగూడెం మండలం రాఘవాపురం వద్ద పెద్దవాగులో స్కూల్ బస్సు పడి 8 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగి రెండేళ్లు కావస్తున్నా అధికారులు ఇంకా అలసత్వం వీడలేదు. ఇటీవల వచ్చిన వరదలకు ఈ వాగుపై ఉన్న బ్రిడ్జి కిందకు కుంగింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం తమ పరిధిలోకి రాదంటూ ఇటు పంచాయతీరాజ్, అటు ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు.  కుంగిపోయిన బ్రిడ్జిపై నుంచే సుజాతనగర్, చండ్రుగొండ వైపు వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. చేస్తాం, చూస్తామంటూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం.
 
 భారీ వర్షాలతో గతుకులమయం..
 ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ప్రధాన రహదారులన్నీ కోతకు గురయ్యాయి. కొత్తగూడెం - భద్రాచలం, కొత్తగూడెం - ఇల్లెందు, కొత్తగూడెం - చండ్రుగొండ, తల్లాడ- సత్తుపల్లి, అశ్వారావుపేట - సత్తుపల్లి, బోనకల్ - ఖమ్మం రహదారులు గతుకులమయంగా మారాయి. ప్యాచ్ వర్క్‌లు అంటూ కాంట్రాక్టర్లు హడావుడిగా పని చేయిస్తున్నా.. వాటిలో నాణ్యత లేక కొద్దిరోజులకే మళ్లీ గుంతలు పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు కాలేదని సంబంధిత అధికారులు చెపుతున్నారు. అయితే ప్యాచ్ వర్క్‌ల పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు ఆయా అధికారుల చేయి తడుపుతూ ప్యాచ్ పనుల్లో నాణ్యత పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లెందు, భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న వాహనాలు అతివేగంగా వెళ్తుంటాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రధాన గ్రామాల సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు.
 
 భారీ వాహనాలతో రోడ్లు అధ్వానం..
 కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్‌ఐరన్ కంపెనీలకు బొగ్గు రవాణా కోసం నిత్యం టిప్పర్‌లు వస్తుంటాయి. ఇవి భారీ లోడుతో ఉండడంతో రోడ్లు గుంతలు పడుతున్నాయి. అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి లారీలు గ్రానైట్ రాళ్ల లోడ్‌తో  కాకినాడ, విశాఖపట్నం వెళ్తుండడంతో.. ఈ బరువుకు రహదారులు నామరూపం లేకుండా పోతున్నాయి. సరైన సమయంలో వీటికి మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో ఈ గుంతలను తప్పించబోతున్న ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులను రేడియం స్టిక్కర్‌లతో ఏర్పాటు చేయడం లేదు. మూలమలుపులు అధికంగా ఉండే దారిలో కూడా కనీసం బోర్డులు ఏర్పాటు చేయాలనే ఆలోచన అధికారుల్లో లేదు. కాగా, రాత్రి వేళ  వాహనాలు నడిపే డ్రైవర్లకు రోడ్డు సరిగ్గా కనిపించకనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులే చెపుతుండడం గమనార ్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement