ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బొలెరో వాహనం
మణుగూరు టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ–2లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు ప్రకాశవని ఖని ఓపెన్ కాస్ట్ (పీకేఓసీ)–2 క్వారీలో ఇద్దరు కార్మికులను తీసుకొని వెళ్తున్న బొలెరో వాహనం.. 100 టన్నుల డంపర్‌ను దాటుతుండగా అది ఢీకొట్టింది. అదే వేగంతో ఆగకుండా బొలెరో వాహనంపైకి ఎక్కి ముందుకు వెళ్లడంతో వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ఉన్న మణుగూరు ఓసీ–2 ఎలక్ట్రీషియన్ అజ్మీరా బాషా (49), హెల్పర్ పరసా సాగర్ (34), బొలెరో ఓనర్–కమ్–డ్రైవర్ వెల్పుల వెంకన్న (45) అక్కడికక్కడే మృతి చెందారు.
అజ్మీరా బాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా పీవీ కాలనీ ఎంసీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇక సాగర్ ఇటీవల డిపెండెంట్‌గా ఉద్యోగంలో చేరగా ఆయనకు పెళ్లి కాలేదు. వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణుగూరు ఏరియాలోని పీకేఓసీ–2లో తొలిసారి ఈ తరహా ప్రమాదం జరగడంతో కార్మికులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా జీఎం జక్కం రమేష్, ఎస్‌ఓటూ జీఎం డి.లలిత్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద సంతాపం తెలిపారు. సంస్థపరంగా వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
చిన్నదారులు.. భారీ యంత్రాలు
ఓపెన్ కాస్టు గనుల్లో భారీ యంత్రాలను వినియోగిస్తుండగా రహదారులు మాత్రం తక్కువ వెడల్పుతో ఉంటున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు కార్మికులు, చెబుతున్నారు. క్వారీల్లో భారీ డంపర్లు నడవడానికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదంటున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం క్వారీల్లో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విశాలమైన రహదారులు నిర్మించాలని, డంపర్లు వెళ్లే ప్రాంతాల్లో ఇతర వాహనాలు రాకుండా ప్రత్యేక దారులు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment