మార్కాపురం, పెద్దారవీడు, న్యూస్‌లైన్: తహశీల్దార్ కార్యాలయాల్లో కీలక విధులు నిర్వర్తించే కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఒక నెలో.. రెండు నెలలో కాదు. ఏకంగా 14 నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో కుటుంబ పోషణ జరగక అప్పుల పాలవుతున్నారు. మార్కాపురం, కందుకూరు, ఒంగోలు రెవెన్యూ డివిజన్లలో 50 మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వీరిని అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించింది. మండల పరిధిలోని నివాస, ఆదాయ, జనన, మరణ తదితర సర్టిఫికెట్లను కంప్యూటరీకరించి జారీ చేయాల్సిన పని వీరిదే.
ఒక్కో కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ 11,013 వేతనం నిర్ణయించారు. అయితే వివిధ పథకాల కింద వేతనంలో కొంత భాగం పోను రూ 8,400 చెల్లించాలి. వీరంతా తహశీల్దార్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అవుట్ సోర్సింగ్ విభాగం కావడంతోనే చిన్నచూపునకు గురవుతున్నారు. సుదీర్ఘ కాలంగా జీతాలు రాకపోయినప్పటికీ విధుల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా కార్యాలయానికి ప్రతి రోజూ హాజరవుతున్నారు. అప్పులు తెచ్చుకొని పొట్ట నింపుకుంటున్నారు. ఇలా మొత్తం 50 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ 58.80 లక్షల బకాయిలు విడుదల కావాల్సి ఉంది.
నిధులు విడుదల చేయాలి:
శ్రీనివాస్: అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు
తహశీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు చాలా కాలంగా వేతనాలు విడుదల కాలేదు. ఒక నెలకు మాత్రమే జీతాలు విడుదల చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చాం. కొంత మంది ఆపరేటర్లు డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల తహశీల్దార్లు బదిలీ కావడంతో సర్టిఫికెట్లు అందడంలేదు. నిధులు విడుదల అయితే అందరికీ బకాయిలతో కూడిన వేతనాలు అందిస్తాం.
14 నెలలుగా జీతాల్లేవ్..
Published Sun, Dec 1 2013 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement