వేదికపై చంద్రబాబుతో తెలంగాణ నేతలు రమణ, రేవంత్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితా పిలిచినప్పుడు ఆయన పేరు ప్రస్తావించినప్పటికీ తొలిరోజు మహానాడుకు రాలేదు.
ముఖ్యమంత్రి చంద్ర బాబు వియ్యంకుడు, ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తొలిరోజు వేదికపై కనిపించలేదు. వీరే కాదు నందమూరి కుటుం బానికి చెందిన ఏ ఒక్కరూ మహానాడు ప్రాంగణంలో కన్పించక పోవడం చర్చనీయాంశమైంది. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే బాలకృష్ణ రాలేదని తెలియడంతో మహానాడు కంటే సినిమా షూటింగ్‌లు ముఖ్యమా అని పలువురు నేతలు చర్చించుకున్నారు.
హరికృష్ణను సరిగ్గా ఆహ్వానించి ఉండరని.. అందువల్లే ఆయన రాలేదని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం వినిపించింది. హరికృష్ణ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఆహ్వానం అంది ఉండదన్న వ్యాఖ్యలు వినిపించాయి.