మాలతీ చందూర్ కన్నుమూత | Noted Telugu writer and columnist malathi chandur no more | Sakshi
Sakshi News home page

మాలతీ చందూర్ కన్నుమూత

Published Thu, Aug 22 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

మాలతీ చందూర్ కన్నుమూత

మాలతీ చందూర్ కన్నుమూత

* కేన్సర్ వ్యాధితో మృతి
* తెలుగులో 26 నవలలు, 300కుపైగా ఆంగ్ల అనువాదాలు చేసిన మాలతి
* అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన
* ‘ప్రమదావనం’ శీర్షికతో గిన్నిస్ రికార్డు
* మాలతి కోరిక మేరకు భౌతికకాయం వైద్య పరిశోధనలకు అప్పగింత
 
సాక్షి, చెన్నై, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు మాలతీ చందూర్ (84) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. కేన్సర్‌కు లోనయినట్లుగా పదిరోజుల కింద గుర్తించారు. సోమవారం శస్త్రచికిత్స చేసి, కడుపులోని కణితిని తొలగించారు. కానీ, శస్త్రచికిత్స అనంతరం సాయంత్రం వరకూ సన్నిహితులతో మాట్లాడిన మాలతీ చందూర్ అదే రాత్రి స్పృహకోల్పోయారు. బుధవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. అయితే మాలతీ చందూర్ కోరిక మేరకు ఆమె భౌతికకాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం శ్రీరామచంద్ర వైద్య కళాశాల (చెన్నై- పోరూరు)కు అందజేశారు.

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం, జ్ఞానాంబ దంపతులకు 1928 డిసెంబర్ 26న జన్మించారు. 8వ తరగతి వరకూ నూజివీడులోనే చదువుకున్న ఆమె.. ఏలూరులో హైస్కూలు, ఉన్నత విద్య పూర్తిచేశారు. అనంతరం ఏలూరులోనే కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్రముఖ రచయిత ఎన్‌ఆర్ చందూర్‌తో 1948లో ఆమె వివాహం జరిగింది. అనంతరం వారు చెన్నైలో స్థిరపడ్డారు.

అనంతరం మాలతీ చందూర్ ఎన్నో రచనలు చేశారు. ఆంధ్రప్రభ వారపత్రికలో రాసిన ‘ప్రమదా వనం’ శీర్షికతో దేశవిదేశాల్లోని తెలుగు గృహిణులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వరుసగా 47 ఏళ్లపాటు కొనసాగిన ఈ శీర్షిక గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. 1953లో ‘వంటలూ-పిండి వంటలూ’ పేరుతో ఒక పుస్తకం రాశారు.

అలాగే పాత కెరటాలు పేరుతో అనేక ఆంగ్ల రచనలను అనువదించారు. ఆమె రాసిన ఆంగ్ల- తెలుగు భాషా వంటల పుస్తకం నేటికీ రికార్డు స్థాయిలో అమ్ముడుపోతోంది. చెన్నైలోని శ్రీపొట్టి శ్రీరాములు స్మారక సొసైటీ చైర్‌పర్సన్‌గా ఆమె అనేక సాహీతీ కార్యక్రమాలను నిర్వహించారు.
 
ఎన్నో పురస్కారాలు
చందూర్ తెలుగులో 26 నవలలు, 300కి పైగా ఆంగ్ల రచనలకు అనువాదాలు చేశారు. ఆమె మొదటి కథ ‘రవ్వ లడ్డూలు’ కాగా.. మొదటి నవల ‘చంపకం చెదపురుగులు’. దాదాపు 11 ఏళ్ల పాటు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. ‘ఆలోచించు, భూమి పుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, శతాబ్ది సూరీడు, శిశిర వసంతం’ వంటి అద్భుత పుస్తకాలను ఆమె రచించారు.

1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కోల్‌కతాకు చెందిన భారత భాషా పరిషత్ అవార్డు, తెలుగు వర్సిటీ అవార్డు అందుకున్నారు. ప్రముఖ తమిళ రచయితలు శివశంకరి, జయకాంతన్, ఎన్.ఎ.పార్థసారథి, పుళమై పిత్తన్, సుజాత, కలైంజర్ కరుణానిధి తదితరులు చేసిన రచనలను సైతం మాలతి తెలుగులోకి అనువదించారు.
 
సాహితీలోకానికి తీరని లోటు
మాలతీ చందూర్ మృతి సాహితీ లోకానికి తీరని లోటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. ఆమె కుటుంబసభ్యులకు తన  సంతాపం తెలిపారు. మాలతీ చందూర్ మూడు దశాబ్దాలకు పైగా చేస్తున్న తన రచనల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని విజయమ్మ పేర్కొన్నారు. మాలతీ చందూర్ మరణం తెలుగు వారికి తీరని లోటని ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నలు, జవాబులు శీర్షికల ద్వారా సమస్యలను పరిష్కరించడంలో ఆమెకు మించిన వారు మరొకరు లేరని వ్యాఖ్యానించారు. మాలతి కుటుంబ సభ్యులకు సినారె ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
కాగా.. మాలతీ చందూర్ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రటకనలో సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య రంగంతో పాటు పాత్రికేయ రంగంలో ఆమె చేసిన కృషిని శ్లాఘించారు. మాలతి మరణం సాహితీ రంగానికి తీరనిలోటన్నారు. మాలతీ చందూర్ మృతి పట్ల టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంపీ నంద మూరి హరికృష్ణ సంతాపం తెలిపారు. కాగా.. మాలతీ చందూర్ మృతి సాహిత్య లోకానికి తీరని లోటుగా అరసం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement