
ఎన్టీఆర్ వేషధారణలో పాలకాయతిప్ప గ్రామస్తులతో మాట్లాడుతున్న బాలకృష్ణ
కృష్ణాజిల్లా, కోడూరు: దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్ కధానాయకుడు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ హంసలదీవి సాగరతీరంలో కోలాహలంగా సాగుతోంది. శుక్రవారం హీరో బాలకృష్ణ ఎన్టీఆర్ వేషధారణలో ఉప్పెన బాధితులను ఓదార్చుతున్నట్లు చిత్రీకరణ జరిపారు. వారికి సినీ పరిశ్రమ తరఫున చేసిన సహాయాలతో పాటు గ్రామాల అభివృద్ధికిచ్చిన తోడ్పాటును ఏవిధంగా ఇచ్చారనే ఆంశాలను పూర్తిస్థాయిలో విశ్లేషించారు.
మరో నటుడు సుమంత్ ఏఎన్‌ఆర్ పాత్రలో నటించారు. సినీనటులతో పోటీగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కూడా షూటింగ్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఉప్పెన సమయంలో బుద్ధప్రసాద్ తండ్రి దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌తో పాటు కలసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అదే సన్నివేశాల్లో బాలకృష్ణ, సుమంత్‌తో పాటు బుద్ధప్రసాద్ కూడా నటించి అందరిని మెపించారు.