= కొనసాగుతున్న ఉద్యమం
= మానవహారాలు, నిరసనలు
= నూజివీడులో వైఎస్సార్ సీపీ ఆటోల ప్రదర్శన
సమైక్య ఆకాంక్ష జిల్లా వాసుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె విరమించి విధుల్లోకి వెళ్లినా జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో వైఎస్సార్‌సీపీ చురుకైన పాత్ర పోషిస్తోంది.
సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. నూజివీడులో వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు శనివారం 300 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల విద్యార్థులు పలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక కోదాడ రోడ్డులోని రహదారిపై విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. కైకలూరు పార్టీ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 74వ రోజుకు చేరాయి.
కలిదిండిలో సంతోషపురం గ్రామస్తులు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో రైతు సభ జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షల్లో పార్టీ కొమ్మిరెడ్డిపల్లి గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. చల్లపల్లిలో చేపట్టిన దీక్ష 71వ రోజుకు, మోపిదేవిలో 48, కోడూరులో 46వ రోజుకు చేరుకున్నాయి. నాగాయలంకలో దీక్షలు కొనసాగుతున్నాయి.
చల్లపల్లి మండలం కొత్తమాజేరు గ్రామానికి చెందిన పలు పాఠశాలల స్కూల్ కమిటీ సభ్యులు దీక్షలు చేశారు. నాగాయలంకలో చోడవరం గ్రామ దళితవాడ రైతులు, మోపిదేవిలో చిరువోలులంక, చిరువోలు, మోపిదేవికి చెందిన గ్రామస్తులు, కోడూరులో మారుతీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు దీక్షలు నిర్వహించారు. గుడివాడ, జగ్గయ్యపేటలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడలో కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని ఎంపీ లగడపాటి రాజగోపాల్ సందర్శించి సంఘీభావం తెలిపారు. సోమవారం మరోసారి రాజీనామాలను స్పీకర్‌కు సమర్పిస్తామని, త్వరలో సమైక్యాంధ్ర కోసం సీఎం పర్యటనలు చేస్తారని ఎంపీ చెప్పారు.
కపర్ధేశ్వరస్వామికి చిత్తర్వు పూజలు...
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చిత్తర్వు నాగేశ్వరరావు పామర్రు మండలం కాపవరంలోని కపర్ధేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంటుమిల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 68వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో మండలంలోని కంచడం, బర్రిపాడు గ్రామాలకు చెందిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలు పాల్గొన్నారు.
పెడనలో జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో శ్రీబొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఒకరోజు పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నూజివీడు చిన్నగాంధీబొమ్మ సెంటరులోని జేఏసీ శిబిరంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 73వ రోజుకు చేరాయి. ఈ శిబిరంలో పట్టణానికి చెందిన యువకులు కూర్చున్నారు.
సెయింట్ మేరీస్ హైస్కూల్, నోవా విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు రిలేదీక్షా శిబిరానికి విచ్చేసి దీక్షలో పాల్గొన్నవారికి మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం 54వ రోజుకు చేరాయి. ముసునూరు మండలం యల్లాపురానికి చెందిన పార్టీ నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఆగిరిపల్లి బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన దీక్షా శిబిరంలో ఆటోవర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
మహిళా కౌలు రైతుల దీక్షలు...
పెదపారుపూడిలో గుర్విందగుంట గ్రామానికి చెందిన మహిళా కౌలు రైతులు దీక్ష చేశారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే దీక్ష జరిపారు. దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కావూరి, సోనియా, బోత్స డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలు, విద్యార్థులు మానవహారం నిర్మించారు. ముదినేపల్లి మండలంలోని వడాలి ప్రాథమిక పాఠశాల-2 ఉపాధ్యాయులు రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు.
వడాలి-తామరకొల్లు ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. గుడివాడ నెహ్రుచౌక్‌లో జరుగుతున్న రిలే దీక్షలు 75వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ జిల్లా జాయింట్ కన్వీనర్ మండలి హనుమంతరావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. నందివాడ టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు శనివారం నాటికి 49వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పోలుకొండ గ్రామ డ్వాక్రా మహిళలు కూర్చున్నారు.
సమైక్య సమరం
Published Sun, Oct 20 2013 12:52 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement