
దీక్షాదక్షత
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టిన సమైక్య సత్యాగ్రహాలకు మద్దతు వెల్లువెత్తుతోంది. గాంధీజయంతి రోజున ప్రారంభమైన ఈ దీక్షలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. అన్నివర్గాల ప్రజలు దీక్షాధారులను కలిసి సంఘీభావం తెలిపారు. కాగా అవనిగడ్డలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్; నందిగామలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావులు చేస్తున్న నిరవధిక దీక్షలను రాత్రి పోలీసులు భగ్నం చేశారు.
మిగతావారి దీక్షలను శుక్రవారం తెల్లవారు జామున భగ్నం చేయవచ్చని సమాచారం. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ సెంట్రల్‌లో పి.గౌతమ్‌రెడ్డి, గన్నవరంలో దుట్టా రవిశంకర్, పెడనలో వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్‌లు దీక్షలను కొనసాగిస్తున్నారు. గొల్లపూడిలో కాజా రాజ్‌కుమార్ గురువారం రిలే దీక్షలో పాల్గొన్నారు. జగ్గయ్యపేటలోని దీక్షా శిబిరంలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. ఎంపీ లగడపాటితోపాటు సీమాంధ్రలోని తొమ్మిది మంది కేంద్ర మంత్రులు పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
బందరులో తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), కేంద్ర పాలకమండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు, పలువురు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. గుడివాడలో తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలో నానితో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోరువానను సైతం లెక్కచేయకుండా వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు గాంధీ మండపం వద్దకు చేరుకుని జై సమైక్యాంధ్ర. జై జగన్.. నినాదాలతో హోరెత్తించారు.
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నందిగామలో సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా పలు గ్రామాలకు చెందిన 31 మంది అభిమానులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. పామర్రులోని నాలుగు రోడ్ల కూడలిలో రెండో రోజు రిలే నిరాహారదీక్షలను ఉప్పులేటి కల్పన ప్రారంభించారు. ఈ దీక్షలో పమిడిముక్కల మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరువూరులో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు.
అవనిగడ్డలో మద్ది వెంకట నారాయణ (చిన్నా), కొండవీటి బాపూజీ, కటికల కిషోర్ (అప్పారావు) నిరవధిక దీక్ష చేస్తుండగా పదిమంది ఒక రోజు దీక్ష చేశారు. మండల యూత్ కన్వీనర్ సింహాద్రి పవన్, రాజనాల బాలాజీ, యాసం మురళి నిరవధిక దీక్ష చేపట్టారు. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు దుట్టా రవిశంకర్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. ఆయనకు మద్దతుగా ఉంగుటూరు గ్రామానికి చెందిన వెనిగళ్ల రాజా 36 గంటల దీక్షకు కూర్చున్నారు. నూజివీడు జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 38వ రోజుకు చేరాయి.
కైకలూరులో రెండో రోజు దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. పెనమలూరు సెంటర్‌లో సమన్వయకర్త పడమట సురేష్‌బాబు రెండో రోజు దీక్షల్లో కూర్చున్నారు. విజయవాడ పశ్చిమలో రెండో రోజు దీక్షల్లో 41వ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు కూర్చున్నారు. ఈ దీక్షలను పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బందర్‌రోడ్డులో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.