ఆయన పేరు ఈశ్వరయ్య. ఉద్యోగం.. మండల తహశీల్దార్. ఆయనకు అధికార పార్టీపై ఎందుకో అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది.
ఒంటిమిట్ట: ఆయన పేరు ఈశ్వరయ్య. ఉద్యోగం.. మండల తహశీల్దార్. ఆయనకు అధికార పార్టీపై ఎందుకో అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది. సదా మీ సేవలో అంటూ వారి ఆదేశాలను తూ.చ. తప్పక పాటించడమే విధిగా పెట్టుకున్నట్లున్నారు. అందుకే.. అధికార పార్టీ నేతలు ఆదేశించిందే తడవు. మండలంలోని పలువురు చౌక దుకాణ డీలర్లను కార్యాలయానికి పిలిపించి ‘మీ పైన ఫిర్యాదులు వస్తున్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోండి.. మీకే మంచిది.. లేదంటే డీలర్‌షిప్ రద్దు చేయాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇదేంటి ఇన్నేళ్లుగా లేని సమస్య ఇప్పుడేం వచ్చిందబ్బా అంటూ డీలర్లు అయోమయానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం కొత్తమాధవరం గ్రామ డీలర్ నాగమురళిని పిలిపించి రాజీనామా చెయ్.. నీకే మంచిదంటూ బెదిరింపు ధోరణిలో సూచించారు. ‘అధికార పార్టీ నాయకుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీ డీలర్‌షిప్పులను కొనసాగిస్తే నాకు తలనొప్పులు తప్పవు. ఎందుకొచ్చిన సమస్య.. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైదొలగండి అని సదరు తహశీల్దార్ డీలర్లకు ఉచిత సలహా ఇస్తున్నారు.
స్టాకు కోసం డీడీ తీసి ఉంటే డీడీలను వెనక్కు తీసుకోండ ని ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి తాము ఓట్లు వేశామనే అక్కసుతోనే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తహశీల్దార్ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాసేలా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.
జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నా : తహశీల్దార్
ఈ విషయంపై తహశీల్దార్ ఈశ్వరయ్యను వివరణ కోరగా తనకు కొంత మంది డీలర్లపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందువల్ల వారిని పిలిపించి డీలర్‌షిప్‌లు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు చూపించండని కోరగా తన వద్ద లేవని సమాధానమిచ్చారు.