ముగ్గురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ యాక్ట్
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇప్పటికే పోలీసులు అరెస్టుచేసిన ముగ్గురు స్మగ్లర్లపై ప్రివెన్‌టివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు నమోదు చేస్తూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ శనివారం ఆదేశాలు జారీచేశారు. చిత్తూరు నగరానికి చెందిన షేక్‌మున్నా (33) అనే లెఫ్ట్ మున్నా, రియాజ్ బాషా (32) అనే దాడీ మున్నా, శ్రీనివాసులు మధు (35) అనే చింతచెట్టు మధుపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. నిందితులు ముగ్గురినీ చిత్తూరులోని జిల్లా జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుల నేర చరిత్రకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
షేక్ మున్నా : చిత్తూరు నగరంలోని అశోకపురానికి చెందిన మక్బూల్ కుమారుడైన ఇతను ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. లారీ డ్రైవర్ జీవనాన్ని గడిపేవాడు. అయితే 2011 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో అడుగుపెట్టాడు. ఎస్కార్ట్‌గా పనిచేస్తూ స్మగ్లర్‌గా ఎదిగాడు. కర్ణాటకకు చెందిన స్మగ్లర్లతో పరిచయాలు ఉన్న ఇతనిపై పోలీసులు ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేశారు. ఇతని నెలసరి ఆదాయం దాదాపు రూ.3 లక్షలు.
రియాజ్‌బాషా : చిత్తూరు నగరంలోని లాలూ గార్డెన్‌కు చెందిన చాంద్‌సాహెబ్ కుమారుడైన రియాజ్‌బాషా పట్టభద్రుడు. త్వరగా లక్షాధికారి అయిపోవాలనే అత్యాశతో 2011లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టాడు. ఇతనూ ఎస్కార్ట్‌గా జీవితం ప్రారంభించి స్మగ్లర్‌గా ఎదిగాడు. ఇతనిపై జిల్లాలో 16 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇతని నెలసరి ఆదాయం సుమారు రూ.4 లక్షలు
శ్రీనివాసులు మధు : చిత్తూరు నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో ఉన్న బాలాజీ కాలనీకి చెందిన ఇతను పాలిటెక్నిక్ (మెకానికల్ ఇంజినీరింగ్) చదువుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారంచేస్తూ 2011లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రవేశించాడు. పెలైట్ నుంచి స్మగ్లర్‌గా ఎదిగాడు. ఇతనికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో, బడా స్మగ్లర్ కమల్ కిషోర్‌తో పరిచయాలున్నాయి. ఇతను ఇప్పటివరకు సుమారు 150 టన్నుల ఎర్రచందనం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేశాడు. ఇతనిపై జిల్లాలో 13 కేసులు ఉన్నాయి. ఇతని నెలసరి ఆదాయం సుమారు రూ.5 లక్షలు.