రుణమాఫీకి మళ్లీ కొర్రీ!
జాబితాలపై పునర్విచారణకు ఆదేశం
లబ్ధిదారుల వడపోతకు సర్కారు ఎత్తులు
వీఆర్వోల చేతికి రుణమాఫీ జాబితాలు
11లోగా నివేదిక కోరిన ప్రభుత్వం
రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులూ పన్నుతోంది. బ్యాంకర్లు రెండు మాసాలు కుస్తీలు పట్టి తయారుచేసిన జాబితాలపై పునర్విచారణ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే అనేక రకాల వడపోతల అనంతరం తయారుచేయించిన జాబితాలపైనా మరోసారి విచారణకు ఆదేశించడం మరికొంతమంది లబ్ధిదారుల పేర్లు తొలగించేందుకేనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
మచిలీపట్నం/విజయవాడ : రుణమాఫీ జాబితాలపై పునర్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో లేవో విచారణ జరపాలని రెవెన్యూ శాఖకు సూచించింది. వీఆర్వోల ద్వారా గ్రామగ్రామానికి వెళ్లి జాబితాలపై పునర్విచారణ జరపి, ఒక్కో లబ్ధిదారుని గురించి విడివిడిగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. దీంతో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ హడావుడిగా జిల్లాలోని సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లను సమావేశపరిచి జాబితాలు అందజేశారు. ఈ నెల 11వ తేదీ లోగా జిల్లాలోని అన్ని
మండలాల్లో యుద్ధప్రాతిపదికన జాబితాల పునఃపరిశీలన ప్రక్రియ పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆయన ఆదేశించారు. దీంతో జిల్లాలోని 50 మండలాల్లో తహశీల్దారులు తమ పరిధిలోని వీఆర్వోలకు శనివారం జాబితాలు అందించారు. రుణమాఫీ అయ్యే రైతుల వివరాలతో పాటు అతని కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల పూర్తి వివరాలు సేకరించాలని మార్గదర్శకాలు ఇచ్చారు. ఇద్దరు కుటుంబసభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఇంటి నంబరులను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో 425 సహకార సంఘాల్లో దాదాపు రెండు లక్షల మంది రైతులు లబ్ధిదారుల జాబితాలో ఉండగా, వాణిజ్య బ్యాంకులకు సంబంధించి మరో రెండు లక్షల మంది వివరాలను రెవెన్యూ సిబ్బంది విచారించాల్సి ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో లక్షలాదిమందికి సంబంధించిన వివరాలు విచారణ చేయడం కష్టమని రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.
బ్యాంకుల జాబితాల్లో 10 శాతం గల్లంతు
వివిధ బ్యాంకుల ద్వారా పంపిన లబ్ధిదారుల జాబితాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 శాతం పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల చేతికి అందిన జాబితాలను కొన్ని మండలాల్లో బ్యాంకుల సిబ్బంది పరిశీలించారు. తాము పంపిన జాబితాల్లో కొన్ని పేర్లు మాయమైనట్లు వారు గుర్తించారు. వీటికి సంబంధించి బ్యాంకులకు ఇంతవరకు ఎటువంటి సమాచారమూ రాలేదు. రైతాంగం బ్యాంకుల వద్దకు వెళ్లి జాబితాల కోసం అడుగుతున్నట్లు ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. జాబితాల్లో పేర్లు గల్లంతయ్యాయని, అంతా గందరగోళంగా ఉందని ఆ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకో?
రుణమాఫీ మెత్తాన్ని కుదించేందుకు ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలను కూడా రెవెన్యూ సిబ్బంది ద్వారా విచారణ చేయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకర్లు తమ వద్ద అప్పు తీసుకున్న రైతులకు సంబందించిన సమాచారం ఇవ్వగా, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు, ఆస్తుల వివరాలు అడుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ ఎలాంటి మెలిక పెడుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.