రుణమాఫీకి ఎన్ని కొర్రీలో.. | How many korrilo runamaphiki .. | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి ఎన్ని కొర్రీలో..

Published Tue, Nov 11 2014 1:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రుణమాఫీకి ఎన్ని కొర్రీలో.. - Sakshi

రుణమాఫీకి ఎన్ని కొర్రీలో..

అన్నదాతల పాలిట వరమనుకున్న రుణమాఫీ వారికి అందకుండా పోతోంది. ప్రభుత్వం రైతులను  పలుమార్లు విచారణ పేరుతో అవమానిస్తూ.. వారి మనోభావాలకు భంగం కలిగిస్తోంది.  పింఛను లబ్ధిదారులను అడ్డదిడ్డంగా ఏరివేసిన కమిటీ తాజాగా రుణమాఫీ జాబితాపై పెత్తనం చెలాయిస్తోంది. అధినేత సూచనల మేరకు ఏరివేతే ప్రధాన లక్ష్యంగా కమిటీని రంగంలోకి దింపినట్లు విశ్వసనీయ సమాచారం.

ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నట్లు నటిస్తూ.. లబ్ధిదారుల ఏరివేతకు రకరకాల కొర్రీలు పెడుతోంది. రుణమాఫీపై తొలిసంతకం పెడుతానని చెప్పిన చంద్రబాబు గుట్టు రోజు రోజుకీ రట్టవుతోంది. రుణమాఫీ జరుగుతుందా? జరగదా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు/(హరనాథఫురం):  టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించారు. హామీలను అమలు చేస్తాం అని చెబుతూనే... రోజుకో జీఓతో అటు అధికారులు.. ఇటు రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. రుణమాఫీ భారం నుంచి బయటపడేందుకు టీడీపీ ప్రభుత్వం అనేక రకాల కుయుక్తులూ పన్నుతోంది. అందుకు తాజా సంఘటనలే నిదర్శనం.

రైతుల రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన విధి విధానాలతో కూడిన జీఓను విడుదల చేసి బ్యాంకర్లకు అందజేసింది.  బ్యాంకర్లు రెండు నెలలు కుస్తీలు పట్టి జాబితా తయారు చేశారు. ఆ తరువాత బ్యాంకర్లు ఇచ్చిన జాబితాపై పునర్విచారణ చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. రకరకాల వడపోతలతో త యారు చేయించిన జాబితాపైనా మరోసారి విచారణకు ఆదేశించడం గమనార్హం. ఈ వడపోతతో మరికొంత మంది లబ్ధిదారుల పేర్లు తొలగించేందుకు ప్రభుత్వం ఎత్తు వేసిందని అధికారులే చర్చించుకుంటున్నారు.

 మరోసారి పునర్విచారణ
 రుణమాఫీ జాబితాపై ప్రభుత్వం మరోసారి పునర్విచారణకు ఆదేశించింది. బ్యాం కర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో లేవో విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖకు సూచించింది. వీఆర్వోల ద్వారా గ్రామ గ్రామానికీ వెళ్లి జాబితాలపై పునర్విచారణ చేపట్టి, ఒక్కో లబ్ధిదారుడి నుంచి విడివిడిగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. ఒక్క రోజులోనే జిల్లాలోని అన్ని మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన జా బితాల పునఃపరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలోని 46 మండలాల్లో తహశీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు జాబితాలు అందించారు. రుణమాఫీ అ య్యే రైతుల వివరాలతో పాటు అతని కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల పూర్తి వివరాలు సేకరించాలని మార్గదర్శకాలు ఇ చ్చారు. వారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ, ఇంటి నంబర్ సేకరించాలని సూచించారు. జిల్లాలో 4,86,291 మంది రైతుల వివరాలను ఒక్క రోజులో విచారణ చేపట్టి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించడం గమనార్హం.

 జన్మభూమి కమిటీ పెత్తనం
 పింఛన్ల ఏరివేతలో గ్రామకమిటీల పెత్తనంతో ఆ ప్రక్రియ రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఆజ్యం పోసిన విషయం తెలిసిందే. తమ వర్గానికి అండగా నిలవలేదనే నెపంతో అధికారపార్టీకి చెందిన గ్రామకమిటీల సభ్యులు ప్రత్యర్థి పార్టీలకు మద్దతు పలికిన వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను ఏరివేతకు తెగబడ్డారు. అలా చేయాలనే ఉద్దేశంతో అధినేత చంద్రబాబు రుణమాఫీ లబ్ధిదారులను ఏరివేసే బాధ్యతను తమ్ముళ్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు రెవెన్యూ అధికారులకు అందిన ఆదేశాల్లో స్పష్టంగా తెలియజేశారు.

అధికారులపై నమ్మకం లేకే చంద్రబాబు తమ్ముళ్లను పురమాయించినట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామాల్లో సోమవారం చేపట్టిన పునర్విచారణలో జన్మభూమి కమిటీ పెత్తనం చెలాయించినట్లు రెవిన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా తహశీల్దార్లకు అందిన ఆదేశాల్లో రుణమాఫీ పోందే రైతుతోపాటు కుటుంబసభ్యుల్లో మేజర్‌లు అయిన ఇద్దరి వివరాలు సేకరించి.. ఆ పత్రాలపై జన్మభూమి కమిటీలతో సంతకాలు సోమవారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు తెల్లముఖం వేశారు. హడావుడిగా పూర్తిచేసి సమాచారంతో సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు వీఆర్వోలు పరుగులు తీయడం కనిపించింది.

 25 శాతం మంది పేర్లు గల్లంతు
 వివిధ బ్యాంకుల ద్వారా పంపిన లబ్ధిదారుల జాబితాల్లో జిల్లా వ్యాప్తంగా 25 శా తం మంది రైతుల పేర్లు గల్లంతైనట్లు అధికార వర్గాల సమాచారం. రెవెన్యూ అధికారుల చేతిలోని జాబితాకు, బ్యాంకర్లు పంపిన బాబితాకు పొంతన లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే కొంత మంది పేర్లు మినహాయించి పంపినట్లు బాబితాను పరిశీలించిన ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు.

వీటికి సంబంధించి బ్యాంకులకు ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. రుణమాఫీ మొత్తాన్ని కుదించి, జాబితా నుంచి రైతుల సంఖ్య తగ్గిం చేందుకే ఇలాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 ఇప్పటిదాకా వడపోతల క్రమమిదీ..
  తాను సీఎం అయితే తొలి సంతకం రైతు రుణమాఫీపై పెట్టి రాష్ర్ట రైతాంగాన్ని రుణవిముక్తులను చేస్తానని చెప్పిన చంద్రబాబు..  సీఎం అయ్యాక రుణమాఫీపై కా కుండా రుణమాఫీ అధ్యయన కమిటీ ఎర్పాటుపై సంతకం పెట్టారు. వారు 45 రోజుల్లో నివేదిక ఇస్తారని చెప్పి దాని ఆధారంగా రుణమాఫీ అని రైతులకు ఝలక్ ఇచ్చారు.

  2014 మార్చి 31 వరకూ ఉన్న రుణాలకు మాఫీ వర్తింపజేస్తామని ప్రకటించి ఆ తరువాత నాలుక్కరుచుకుని 2013 డిసెంబర్ 31 లోపు రుణం పొంది 2014 మార్చి 31 వరకూ కొనసాగుతున్న రుణాలకే మాఫీ అని ప్రభుత్వం ప్రకటించింది.

  ఆ తరువాత అన్ని రుణాలు మాఫీ లేదు... కేవలం కుటుంబానికి ఒకరికి మాత్రమేనని, అది కూడా రూ.1.50 లక్షల మాఫీ అని ప్రకటించింది. అందుకు పట్టాదారు పాస్‌పుస్తకం ఉండాలని, ఆ పుస్తం పెట్టి తీసుకుని ఉన్న బ్యాంక్‌కే ప్రాధాన్యం అంటూ మరో కొత్తపల్లవి ఎత్తుకుంది. దీంతో బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు గాలిలో కలిసిపోయాయి.

  ఆర్‌బీఐ ఒప్పుకోవడం లేదని.. కేంద్రం సహకరించడం లేదంటూ మరికొంత కాలం సాగదీసింది. రుణాలను ఐదేళ్ల పాటు  రీషెడ్యూల్‌చేస్తే రైతుల ఖాతాలో ఆ మొత్తాలను వేస్తామని వారు బ్యాంకర్లు చెల్లిస్తారనే మరో కొత్తవాదాన్ని తెరపైకి తెచ్చి సాగదీత ధోరణిని అవలంబించింది.

  మాఫీ ప్రక్రియను మరి కొంతకాలం సాగదీసేందుకు రైతులు వివిధ బ్యాంక్‌ల్లో రుణాలు పోందివున్నారని, వారి ఆధార్ కార్డు, పట్టాదారుపాస్ పుస్తకాల ఆధారంగా అనుసంధానంతో లోపాలు లేకుం డా పక్కాగా రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించి నెలలు కాలంగా ఈ ప్రక్రియను టీడీపీ ప్రభుత్వం కొనసాగించింది.

  తాజాగా రుణమాఫీ పొందే రైతుల వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై ఆధారపడిన ఇద్దరు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఇవ్వాలి. ఇంటిపేరు, పేరు, రుణమాఫీ పొందే రైతుతో బంధుత్వం, డోర్ నంబర్, ఒటరు ఐడీకార్డు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు వివరాలను వీఆర్వోలు సేకరించాలి.

 సేకరించిన వివరాలపై జన్మభూమి కమిటీలతో ధ్రువీకరించి తహశీల్దార్‌కు అందిస్తే ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపాలి.
 
 బ్యాంకులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు :
 తొలుత బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతుల జాబితాలను ప్రభుత్వం పంపించమంది. జిల్లాలో 34 బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న 4,86,291 మంది రుణమాఫీకి అర్హులని నివేదికలను ప్రభుత్వానికి పంపాం. వీటిలో ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు సరిలేవని, సరి చేసి పంపాలని ఆ జాబితాను వెనక్కు పంపింది.

ఆన్‌లైన్‌లో 2,11,803 మంది రైతుల వివరాలను, 2,74,488 మంది వివరాలను ఆఫ్‌లైన్‌లో తప్పులను సవరించిన జాబితాను తిరిగి ప్రభుత్వానికి పంపాం. ఆ జా బితాపై పునర్విచారణ చేపట్టాలని బ్యాంకులకు ఎలాంటి సమాచారం రాలేదు.  తహశీల్దార్ కార్యాలయాలకు మాత్రమే విచారణ జాబితాను పంపించారు.
   - వెంకటేశ్వరరావు, ఎల్‌డీఎమ్, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement