గూగుల్ కి షాకిచ్చిన కోర్టు
అలహాబాద్: గ్లోబల్ సెర్చి ఇంజీన్ కంపెనీ గూగుల్ సీఈవో, భారత్ లోని గూగుల్ ఇతర ప్రధాన అధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. మంగళవారం అలహాబాద్ స్థానిక కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరును టాప్ టెన్ క్రిమినల్స్ లిస్టులో చేర్చడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సీఈవో సహా ఇతర భారత్ కు చెందిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా ఫిర్యాదుపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 31 కి వాయిదా వేసింది.
గత ఏడాది గూగుల్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ టెన్ నేరస్థుల జాబితాలో మోదీ ఫోటో ప్రత్యక్షంకావడంతో వివాదం రేగింది. దావూద్, అబ్బాస్ నఖ్వీ లాంటి కరడుకట్టిన క్రిమినల్స్ పక్కన ప్రధాని నరేంద్ర మోదీ పేరు జతచేరడంపై న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా 2015 నవంబరులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేశారు. అయితే ఇది క్రిమినల్ కేసు కిందికి వస్తుందని దీన్ని సీజెఎం తిరస్కరించారు. దీన్ని సవాల్ చేస్తూ సుశీల్ కమార్ రివిజన్ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.
కాగా టాప్ టెన్ క్రిమినల్ లిస్ట్ లో మోదీ పోటోపై గూగుల్ క్షమాపణ చెప్పింది. ఎక్కడో పొరపాటు జరిగిందని వివరణ యిచ్చిన సంగతి తెలిసిందే.