జిల్లాపై చంద్రబాబు నాయుడు మరోసారి చిన్నచూపు చూశారు.
♦ రాజధాని కారిడార్‌లో దక్కని చోటు
♦ వాడరేవు, మార్టూరులు మ్యాప్‌లో ఉన్నా ప్రస్తావించని ప్రభుత్వం
♦ పారిశ్రామిక కారిడార్‌పైనా అనుమానాలే
♦ గుంటూరు, కృష్ణాలకే అభివృద్ధి పరిమితం
♦ పక్కనే ఉన్న ప్రకాశంను పట్టించుకోకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు
ప్రత్యేక సరుకు రవాణా మార్గాల విషయానికి వస్తే వాడరేవు పోర్టు నుంచి బాపట్ల - తెనాలి ఉండగా, జాతీయ జల మార్గాల విషయానికి వస్తే విజయవాడ- తెనాలి- బాపట్ల- వాడరేవు-బకింగ్‌హామ్ కాల్వ ఉన్నాయి. అయితే వీటి ప్రస్తావన కూడా చేయలేదు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసినా వాడరేవు పోర్టు అభివృద్ధయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదు. ఇటీవల కాలంలో కేంద్రం మొత్తం 13 జాతీయ స్థాయి విద్యాసంస్థలు కేటాయిస్తే ఒక్కటి కూడా జిల్లాకు దక్కలేదు. రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా ఉండి, దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నా కేంద్రం నుంచి కూడా నిధులు తేలేకపోయారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాపై చంద్రబాబు నాయుడు మరోసారి చిన్నచూపు చూశారు. సింగపూర్ అందించిన మాస్టర్‌ప్లాన్‌లో మార్టూరు, వాడరేవుల ప్రస్తావన ఉన్నా రాష్ట్ర క్యాబినెట్‌లోనూ, అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కూడా ఎక్కడా జిల్లా కోసం ప్రస్తావించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రకటించిన కారిడార్లన్నీ గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఉండటం, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాకు ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా ప్రకటించకపోవడం పట్ల తెలుగుదేశం నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
‘నిజాంపట్నంతోపాటు వాడరేవును కూడా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేస్తున్నట్లు సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌లో ఉన్నా చంద్రబాబునాయుడు మాత్రం నిజాంపట్నం పోర్టును మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించారు. అభివృద్ధి కారిడార్లలో మార్టూరు - చిలకలూరిపేట - గుంటూరు - మంగళగిరి రోడ్డు ఉంది. మార్టూరు ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉంది. దాన్ని కూడా ప్రస్తావించలేదు.
దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఇప్పటి వరకూ చర్యలు లేవు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ కోసం 50 వేల ఎకరాలు, పామూరులో 20 వేల ఎకరాలు, సీఎస్‌పురంలో 10 వేల ఎకరాలు భూ బ్యాంకుగా గుర్తించారు.
రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి ఆరు వేల ఎకరాలను గుర్తించారు. అయితే ఇప్పటికీ పారిశ్రామిక వాడగాని, కనిగిరి ప్రాంతంలో నిర్మించదలిచిన నిమ్జ్ కూడా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ది కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
వెలిగొండ ప్రాజెక్టుకు కూడా కనీసం ఐదు వందల కోట్ల రూపాయల వరకూ కేటాయిస్తేగాని మొదటిదశ పూర్తయ్యే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.75 కోట్లు, ఈ ఏడాది రూ.153 కోట్లు మాత్రమే కేటాయించింది. తక్కువ మొత్తం కేటాయించడం వల్ల ఆ మొత్తం పాత బకాయిలకు, సిబ్బంది వేతనాలకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది.