విజయవాడ నగరపాలక సంస్థ
2008లో బీపీఎస్ దరఖాస్తులు 15,826
క్లియర్ అయినవి 11,287
ఈ ఏడాది దరఖాస్తులు 5,700
గుంటూరు నగరపాలక సంస్థ
2008లో బీపీఎస్ దరఖాస్తులు 9,965
క్లియర్ అయినవి 9,935
ఈ ఏడాది దరఖాస్తులు 4,750
ఇదీ నల్లకుబేరుల ఆందోళన
ఆన్‌లైన్ విధానంతో ‘బ్లాక్’ భయం
మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారులు
బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు ఆన్‌లైన్‌తో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల క్రమబద్ధీకరణకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంది. ఫీజు మొత్తం ఆన్‌లైన్‌లో చెల్లిస్తే బ్లాక్‌మనీ బండారం బద్దలై ఆదాయ పన్ను శాఖ అధికారుల కన్ను తమపై పడుతుందనే భయంతో నల్ల కుబేరులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం డెడ్‌లైన్ల పేరిట నెలల తరబడి గడువు పెంచినా టార్గెట్ పూర్తవటం లేదు.
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం మే 27 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,600 దరఖాస్తులు అందాయి. 2008తో పోలిస్తే ఇది మూడో వంతేనని అధికారులు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో 10,450 దరఖాస్తులు అందాయి. ఈ రెండు నగరాల్లోనే సుమారు 25 వేల దరఖాస్తులు వస్తాయని భావించిన టౌన్‌ప్లానింగ్ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఆన్‌లైన్ విధానం వల్లే గృహనిర్మాణ యజమానులు ముందుకు రావడం లేదన్న నిర్ధారణకు అధికారులు వచ్చారు. ఈ విషయమై మునిసిపల్ మంత్రి నారాయణతో చర్చించాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
అసలు కథ ఆన్‌లైన్ తర్వాతే...
బీపీఎస్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే టౌన్‌ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వస్తారు. గృహాన్ని నిశితంగా పరిశీలించి కొలతలు తీసుకుంటారు. దరఖాస్తులో పేర్కొన్న విధంగా అన్నీ సక్రమంగా ఉంటే బీపీఎస్‌ను ఓకే చేస్తారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆన్‌లైన్‌లోనే మిగతా సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలను క్రమబద్ధీకరించాలంటూ సుమారు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బీపీఎస్ కింద సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ఈ మొత్తం సొమ్మును ఆన్‌లైన్లో ఒకే ఖాతా నుంచి జమచేసినట్లయితే బ్లాక్ మనీ బాగోతం వెలుగుచూసి ఎక్కడ బుక్కయిపోతామోనని నల్లకుబేరులు హడలెత్తుతున్నారు. మాన్యువల్ పద్ధతిలో అయితే వేర్వేరు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసి బీపీఎస్‌కు చెల్లించే అవకాశం ఉండేదన్నది వారి వాదన.
స్పెషల్ డ్రైవ్‌కు అధికారుల నిర్ణయం
బీపీఎస్ గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. గడచిన ఐదు నెలలుగా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారుల్లో హైరానా మొదలైంది. 2007 నుంచి ఇప్పటి వరకు మంజూరు చేసిన బిల్డింగ్ ప్లాన్ల ఆధారంగా ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. డీవియేషన్లు ఉన్న గృహాలకు బీపీఎస్ అని రాసి ‘ఇంటూ మార్క్’ వేస్తున్నారు. ఆ గృహ నిర్మాణదారుడి నుంచి దరఖాస్తు అందిన వెంటనే ‘ఇంటూ మార్క్’ను చెరిపేసే విధంగా ప్లాన్ చేశారు.అప్పుల ఊబిలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ బీపీఎస్‌పై గంపెడాశ పెట్టుకుంది. సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా కట్టింది. అయితే బీపీఎస్ ఆదాయానికి ఆన్‌లైన్ విధానం గండికొడుతోంది.
ఆన్‌లైన్ వల్లే ఇబ్బంది
ఆన్‌లైన్ విధానం వల్లే ఆశించిన స్థాయిలో బీపీఎస్‌కు దరఖాస్తులు రావడం లేదు. మా వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ఇబ్బందుల వల్ల బహుళ అంతస్తుల భవన యజమానులు ముందుకు రావడం లేదు. గడువులోపు లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రయత్నిస్తాం.
- జి.వి.రఘు,
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్, విజయవాడ
దరఖాస్తు ప్రక్రియ ఇలా...
బీపీఎస్ దరఖాస్తుదారులు అప్రూవ్డ్, డీవియేషన్ ప్లాన్లను స్కాన్ చేయాలి. ఆటో క్యాడ్ మ్యాప్ తీసి రిజిస్ట్రేషన్ విలువ ఎంత అనేది స్పష్టంగా పేర్కొనాలి. భవనం ఎలివేషన్ ఫొటోను స్కాన్ చేయాలి. ఆన్‌లైన్ విధానంలో ఇవన్నీ చేశాక కంప్యూటర్ పేమెంట్ మోడ్ అడుగుతుంది. క్రెడిట్ కార్డు, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్‌లలో ఏదో ఒకదాన్ని టిక్ చేయాలి. వెంటనే రూ.10 వేలు దరఖాస్తుదారుడి ఖాతా నుంచి నగదు జమ అవుతుంది. ఆ వెంటనే ఐదు డిజిట్ల నంబర్.. మెసేజ్ రూపంలో ఫోన్‌కు వస్తుంది. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
బీపీఎస్‌కెళితే బుక్కే!
Published Sat, Nov 14 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM
Advertisement
Advertisement