రైతన్నలు భిక్షాటన చేయాల్సిందేనా?
⇒ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ ఆవేదన
⇒ సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి దొరక్క రైతన్నలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి, భిక్షాటన చేయాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తుండడమే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు కేరళలో భిక్షాటన చేస్తున్నట్లు పత్రికల్లో ప్రచురితమైన దయనీయ కథనాలను సభ ముందుంచారు. ఉపాధి హామీ పథకం అమలులో మెటీరియల్ వ్యయాన్ని తగ్గించి, కార్మికుల వ్యయాన్ని వీలైనంతగా పెంచాలని సూచించారు. అప్పుడే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
నిధులను ఉపాధి కల్పనకే వెచ్చించాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 97.5 శాతం ఉపాధి హామీ పథకం నిధులను ఉపాధి కల్పించడానికే (లేబర్ కాంపొనెంట్) వెచ్చించారని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంగన్‌వా డీ, పంచాయతీ భవనాల నిర్మాణానికి, సీసీ రో డ్లు వేయడానికి, చివరకు శ్మశానాలకు కూడా ఉపాధి హామీ పథకం నిధులే ఇవ్వడం దారుణ మన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణులకు ఉపాధి కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
పథకం అమలుకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు దొరక్క ప్రజలు కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, అక్కడ భిక్షాటన చేస్తున్నారని, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని నిలదీశారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, మెటీరియల్ వ్యయానికి డబ్బులెక్కువ ఇచ్చాం కాబట్టి అవార్డులు వచ్చాయని ప్రభుత్వం చెప్పడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. భిక్షాటన చేస్తున్న రైతులపై ఔదార్యంతో కేరళ ప్రభుత్వం 25 కిలోల బియ్యం ఇవ్వడానికి ముందుకొచ్చిందని, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం నిధులను ఉపాధి కల్పించడానికే వెచ్చించాలని కోరారు. దీనివల్ల వలసలు ఉండవని, అన్నదాతలు భిక్షాటన చేయాల్సిన దుస్థితి దాపురించదని స్పష్టం చేశారు.