అమరావతి: ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ కుడికాల్వకు నీళ్లు ఇవ్వడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్ని రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తే... అసెంబ్లీలో చర్చించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి వైఎస్ జగన్ పర్యటనతో చలనం వచ్చిందని అన్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ కుడికాల్వకు నీళ్లు ఇవ్వడం లేదని, శ్రీశైలంలో నీళ్లున్నా రైతుల గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకు ముందు వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు పోడియం ఎదుట నిలబడి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.