
ఔను వారు జీవచ్ఛవాలే.. పలుకరించే తోడు లేదు. పట్టెడన్నం పెట్టే చేయీ లేదు. ఒంటికి వచ్చిన రోగం ఓపికనంతా పిండేస్తోంది. శరీరానికి తగిలిన గాయం ప్రాణాలను నిలువునా తోడేస్తోంది. దారినపోయే దానయ్యలెవరో దయతలిస్తే ఆస్పత్రికి చేరినా వైద్యానికి నోచుకోని అభాగ్యులు. వైద్యులు, వైద్య సిబ్బంది అనుక్షణం హడావుడిగా ఉండే అత్యవసర విభాగం వద్దనే స్ట్రెచర్‌పై కదలలేని పరిస్థితుల్లో పడి ఉన్నా ఎవరికీ పట్టని అనాథలు. ఇదీ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో నెలకొన్న పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన, ప్రయాణంలో ఉండగా అనారోగ్యంతో అస్వస్థతకు గురైన రోగులను సహాయకులు లేరన్న కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు. ప్రాణాపాయస్థితిలో ఉన్నా స్ట్రెచర్లపైనే వదిలేస్తున్నారు. వార్డులో చేర్చకపోవడంతో వారికి ఆహారం కూడా అందడం లేదు. ప్రాణం పోయేవరకు రోగులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు.
ఎప్పుడూ వివిధ శాఖల అధికారులతో కలిసి వేదికపై కూర్చుని, తమ వద్దకు వచ్చే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ఆలకించారు. పలు సమస్యలను పరిష్కరించాలంటూ అప్పటికప్పుడే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే అవకాశమున్న ‘గ్రీవెన్స్’ అంటే తనకెంతో ఇష్టమన్నారు. సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ఏ ఒక్కరు అసంతృప్తితో వెనుదిరిగినా ఇక తమ అధికారాలకు అర్థమే లేదన్నారు.
గుంటూరు ఈస్ట్ : శ్రీకాకుళం జిల్లాకు చెందిన 30 ఏళ్ల చిన్ననారాయణ తాపీ పనుల కోసం చెన్నై వెళ్లి తిరిగి రైలులో ప్రయాణిస్తున్నాడు. గుంటూరు సమీపంలో రైలు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 ద్వారా జూన్ 28న అత్యవసర విభాగానికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. చిన్ననారాయణ కొంత మతిస్థితిమతం కోల్పోవడం, సెల్‌ఫోన్ పోగొట్టుకున్న కారణంగా బంధువుల వివరాలు చెప్పలేకపోయాడు. తన పని తాను చేసుకోలేక నరకయాతన పడుతున్నాడు. ఆకలి అయితే తిండి పెట్టేవారు లేక, మరోవైపు గాయాల నొప్పులతో అల్లాడిపోతున్నాడు.
ఈ నెల 8న పక్షవాతంతో గుర్తు తెలియని వృద్ధుడు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి షేక్ రబ్బాని జీజీహెచ్ అత్యవసర విభాగంలో చేరారు. ఇద్దరూ కొంత స్పృహలో ఉన్నప్పటికీ తీవ్ర అస్వస్థతో తమ వివరాలు చెప్పలేక పోయారు. స్ట్రెచర్ మీద నుంచి పైకి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నారు. వారిని పట్టించుకున్న నాథుడే లేడు.
ఎందరో రోగులు.. కొందరే వైద్యులు
ఇలా తీవ్ర అస్వస్థతో జీజీహెచ్ అత్యవసర విభాగానికి వచ్చే గుర్తు తెలియని వ్యక్తులు, అనాథల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వీరికి సహాయకులు ఎవరు ఉండక పోవడంతో ఎక్కువ కాలం వార్డుల్లో ఉండాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఈ క్రమంలో పట్టించుకునేవారు లేకపోవడంతో అత్యంత దయనీయంగా బతుకీడుస్తున్నారు. ప్రతిరోజు జీజీహెచ్‌కు 3,500 నుంచి 4,000 మంది రోగులు చికిత్స నిమిత్తం వస్తారు. అత్యవసర విభాగానికి ప్రతి రోజు వెయ్యి మందికి పైగా వస్తుంటారు. వీరందరికీ సమర్థవంతంగా చికిత్స అందించడానికి వైద్య, వైద్యేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా అడ్మిషన్ పొంది సహాయకులు ఉన్న రోగులకు చికిత్స అందించడంలో చాలా సార్లు లోపాలు వెల్లువెత్తాయి. నెలకు సుమారు 50 నుంచి 60 మంది అనాథలు, గుర్తు తెలియని వ్యక్తులు తీవ్ర గాయాలతో జీజీహెచ్‌కు వస్తున్నారు. వీరిని వార్డులో చేర్చుకుని ఎక్కువ రోజులు చికిత్స అందించడం ప్రశ్నార్థకంగా మారుతోంది.
ప్రాణాలు పోతున్నాయి..
సహాయకులు లేని రోగులను వార్డుల్లో చేర్చుకోవడానికి గతంలో వైద్యులు నిరాకరించేవారు. కానీ ప్రతికల్లో వచ్చిన కథనాలతో ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి వారిని వార్డుల్లో చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఇటువంటి వారిని వైద్య సేవలు లభిస్తున్నాయి. కానీ కదలలేని స్థితిలో ఉన్న వీరికి ఆహారం ఇచ్చేవారు కరువయ్యారు. అంతే కాకుండా వీరు తమ పనులు చేసుకోలేక మంచం మీద, స్ట్రెచర్‌పై సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రత్యేక చర్యలు చేపట్టాలి..
ఇటువంటి వారిలో ఎముకలు విరిగినవారిని ఆర్థో విభాగానికి, నరాల సంబంధిత సమస్యలు ఉన్న వారిని నరాల విభాగానికి పంపుతున్నారు. ఇతర సమస్యలు ఉన్నవారిని ఎక్కడ బెడ్లు ఖాళీ ఉంటే అక్కడ వదిలి పెడుతున్నారు. అయితే తిండి అందక విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలో మృతి చెందిగానే మార్చురికి తరలిస్తున్నారు. ఒక్కొసారి బాగా బతికిన కుటుంబాలకు చెందిన వారు, ఇతర రాష్ట్రాల వారు ప్రయాణాలలో గాయపడి వస్తే వారిది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఇటు వంటి వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు మానవసేవ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘మానవ సేవ’ ఏమైంది?
జీజీహెచ్‌లో రోగులకు సహాయం అందించేందుకు మాన సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య అధికారులు క్రమేపీ దానిపై అశ్రద్ధ వహిస్తూ వచ్చారు. ఫలితంగా కార్యక్రమం పడకేసింది. ఇందులో భాగంగా రోగులకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న మానవతావాదులు జీజీహెచ్‌కు వచ్చి వివిధ వార్డుల్లో రోగులకు సేవ చేసేవారు. ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తే నగరంలోని విద్యార్థులు, యువత, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో వచ్చి రోగులకు సేవల అందించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment