భవిత వైపు వడివడిగా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణకు ఉపక్రమించారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని.. పార్టీని ప్రజాక్షేత్రంలో బలమైన, బాధ్యతాయుతమైన రాజకీయపక్షంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం రాజమండ్రి వేదికగా నియోజకవర్గాల సమీక్షకు నిర్ణయించారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని ఈ నెల 4, 5 తేదీల్లో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది.
జిల్లా సమీక్ష ఇలా...
పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ను ఈ నెల 4న నిర్వహిస్తారు. అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్ సమీక్షను కూడా ఆ రోజే నిర్వహించాలని నిర్ణయించారు. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షను ఈ నెల 5న నిర్వహిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షకు అరగంట సమయం కేటాయించారు. ఈ సమావేశాల్లో పార్టీ అభ్యర్థులు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15మంది వరకు ముఖ్య నేతలు పాల్గొంటారు.
భవిత దిశగా అడుగులు...
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం.. భవిష్యత్తు కార్యాచరణే ప్రధాన లక్ష్యాలుగా అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారు. ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతోపాటు పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. రాష్ట్రస్థాయిలో పార్టీ విధానాలతోపాటు జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై కూడా దృష్టి సారించనున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ‘నేనున్నాను’అని జగన్‌మోహన్‌రెడ్డి సందర్భంగా భరోసా ఇవ్వనున్నారు. అధికారాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ పార్టీకి గణనీయమైన ఓట్లు రావడంతో కార్యకర్తలు డీలాపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పనున్నారు.
ఇక నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని నేతలకు అధినేత స్పష్టం చేయనున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై జిల్లా నేతల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని నేతల నుంచి క్షేత్రస్థాయి అభిప్రాయాలను క్రోడీకరించి హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో చర్చించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా ఉంది. అందువల్లే రాజమండ్రిలో జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.