
పీఏసీఎస్‌లకు రుణ మాఫీ సెగ
- ఏడాదిగా నిలిచిపోయిన రికవరీ
- ఇదే సాకుగా సంఘ ఉద్యోగుల జీతాల నిలిపివేత
- రుణమాఫీ పూర్తిగా అమలుకాకుంటే కష్టమే
- ఆందోళన వ్యక్తం చేస్తున్న సహకార ఉద్యోగులు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : రుణమాఫీ పథకం సెగ పీఏసీఎస్‌లకు తాకింది. ఎన్నికల నేపథ్యంలో ఏడాది క్రితమే ప్రకటించిన రుణమాఫీ పథకం ప్రకటనతో వసూళ్లు నిలిచిపోయాయి. దీంతో సొసైటీ ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ రుణమాఫీ సాధ్యం కాకపోతే సంఘాలన్నీ చితికిపోయే ప్రమాదముంది. వ్యవసాయం చేసే రైతులకు ప్రధానంగా రుణాలిచ్చి ఆదుకునేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే(పీఏసీఎస్).
జిల్లాలోని 98 పీఏసీఎస్‌ల్లో 1.45 లక్షల రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరికి 2013-14 వ్యవసాయ సీజన్‌కుగాను రూ. 240 కోట్లు రుణంగా అందించారు. అదనంగా దీర్ఘకాలిక రుణాలుగా రూ. 40 కోట్లు పంపిణీ చేశారు. గత సీజన్‌లో పీఏసీఎస్‌ల్లోనే రైతులకు రూ.280 కోట్ల రుణం అందింది. రికవరీ అనంతరం కొత్త రుణాలు ఇవ్వడం ఏటా జరిగే పర్వం. కానీ ఈ ఏడాదే పరిస్థితి డైలామాలో ఉంది.
నిలిచిన రికవరీ
ఏడాది క్రితమే సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభం కావడం, తొలినుంచీ తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీని భుజానికి ఎత్తుకోవడంతో జిల్లాలోని 98 పీఏసీఎస్‌ల పరిధిలో రుణ బకాయిల వసూళ్లు నిలిచిపోయాయి. రికవరీని సాకుగా చూపి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పీఏసీఎస్ ఉద్యోగుల జీతభత్యాలు నిలిపివేసింది. ఐదు నెలలుగా దాదాపు రూ.2 కోట్లు నిలిచిపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.
సంపూర్ణ మాఫీ కాకుంటే ప్రమాదమే
సంపూర్ణ రుణ మాఫీ ప్రకటనతో రైతులంతా బకాయిల చెల్లింపులు నిలిపివేశారు. ఈ దశలో ఒక పరిధి విధించి రుణ మాఫీ చేస్తే, మిగిలిన రైతులు బకాయిలు చెల్లించే పరిస్థితి ఉండదు. ఈ పరిణామం సహకార సంఘాలన్నీ చితికిపోయేందుకు దారితీస్తుందని జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పినపాత్రుని నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని శాఖలు కలిసి రుణాల పంపిణీలో భాద్యత వహిస్తున్నా, బకాయిల వసూళ్ల విషయంలో మాత్రం సహకార సంఘాల ఉద్యోగులనే భాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు సహకార వ్యవస్థ పతనానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.