పంట పండింది | Paddy Cultivation Under Irrigation Project At Record Levels In Kharif In AP | Sakshi
Sakshi News home page

పంట పండింది

Published Mon, Oct 7 2019 4:34 AM | Last Updated on Mon, Oct 7 2019 11:59 AM

Paddy Cultivation Under Irrigation Project At Record Levels In Kharif In AP - Sakshi

సాక్షి, అమరావతి: భారత దేశ ధాన్యాగారం (రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా)గా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌ మరోసారి తన ఘనతను చాటుకుంటోంది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో గరిష్టంగా సాగు నీరందించడంతో అత్యధిక విస్తీర్ణంలో వరిసాగు చేశారు. కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా వరద జలాలను ఒడిసి పట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు, ఏపీఎస్సైడీసీ (ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) కింద ప్రస్తుత నీటి సంవత్సరం (జూన్‌ 1 నుంచి మే 31)లో ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీటిని అందించింది. దీంతో ఈ నెల 4వ తేదీ వరకు మొత్తం 59.48 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. ఇందులో ఒక్క వరి విస్తీర్ణమే 49.71 లక్షల ఎకరాలు. కాగా, గత ఏడాది ఖరీఫ్, రబీల్లో వివిధ ప్రాజెక్టుల కింద 32.53 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని విడుదల చేయడం గమనార్హం.

సాధారణం కన్నా అధికంగా..
శ్రీకాకుళం, కృష్ణా, కర్నూల్, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో సాధారణం కన్నా అధిక విస్తీర్ణంలో ఈసారి వరి సాగుచేశారు. వంశధార ప్రాజెక్టు నుంచి కేసీ (కర్నూల్‌–కడప) కెనాల్‌ వరకూ ఏ ప్రాజెక్టు ఆయకట్టును చూసినా పచ్చని పైర్లతో కళకళాడుతున్నాయి. వరి సాగు విస్తీర్ణం పెరగడం.. నీటి కొరత లేకపోవడంతో దిగుబడులు రికార్డు స్థాయిలో వచ్చే అవకాశం ఉందని నిపుణులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల కింద 70.44, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల కింద 25.60, ఏపీఎస్సైడీసీ కింద 8.34 వెరసి 104.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

గత పదేళ్లలో ఎన్నడూ ఇందులో సగం ఆయకట్టుకూ సక్రమంగా నీళ్లందించిన దాఖలాల్లేవు. ఈ ఏడాది జూన్‌లో సక్రమంగా వర్షాలు కురవనప్పటికీ జూలై చివర్లో నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. దీంతో ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూలై 31న శ్రీశైలానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు.. జూన్‌ ఆఖరు నుంచే గోదావరి, వంశధార నదుల్లో ప్రారంభమైన వరద ఉధృతి ఇప్పటికీ కొనసాగుతోంది.

ఆయకట్టుకు నీటి విడుదల
ఈ పరిస్థితుల్లో గోదావరి, వంశధార, కృష్ణా, పెన్నా వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టి.. అధిక విస్తీర్ణానికి నీళ్లందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నీటి యాజమాన్య పద్ధతులను అనుసరించి.. ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. దాంతో జూన్‌ మొదటి వారంలోనే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, వంశధార ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత కృష్ణా నదిలో వరద ఉధృతికి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోవడంతో నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలకు ఆగస్టు రెండో వారంలో నీటిని విడుదల చేశారు.

శ్రీశైలం నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, వంశధార నీటిని కూడా విడుదల చేశారు. తుంగభద్ర పరవళ్లు తొక్కడంతో ఆగస్టు మొదటి వారంలో కేసీ కెనాల్, హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ కాలువ)లకూ నీటిని విడుదల చేశారు. పెన్నా డెల్టా, సోమశిల, కండలేరు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. తోటపల్లి, నారాయణపురం ఆనకట్ట, జంఝావతి, మడ్డువలస, ఒట్టిగడ్డ, ఏలేరు, ఎర్రకాల్వ, పుష్కర ఎత్తిపోతల, తాడిపూడి ఎత్తిపోతల తదితర  ప్రాజెక్టుల ఆయకట్టుకూ నీళ్లందిస్తున్నారు.

భూమికి పచ్చాని రంగేసినట్టు..
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో వంశధార స్టేజ్‌–1 కింద 1,47,733, వంశధార స్టేజ్‌–2 కింద 63,694, నారాయణపురం ఆనకట్ట కింద 35,200, తోటపల్లి (పాత రెగ్యులేటర్‌) కింద 37,567, తోటపల్లి బ్యారేజీ(కొత్తది) కింద 53,841 వెరసి 3,38,035 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తున్నారు. దాంతో ఆ జిల్లాలో సాధారణం కన్నా అధిక విస్తీర్ణంలో వరి సాగుచేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాలు కూడా వరి పైరుతో కళకళాడుతున్నాయి. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలకు 2014–15 నుంచి ఇప్పటివరకూ వరికి నీళ్లందించలేదు. టీడీపీ సర్కార్‌ ఐదేళ్లపాటు సాగర్‌ ఆయకట్టులో వరి సాగును అనధికారికంగా నిషేధించింది. కానీ, ఈ ఏడాది సాగర్‌ ఆయకట్టులో పంటల సాగుకు ప్రస్తుత సర్కార్‌ ఎలాంటి షరతులు విధించలేదు.

దాంతో ఐదేళ్ల తర్వాత సాగర్‌ ఆయకట్టులో ఈ ఏడాది వరి సాగుచేస్తున్నారు. ఇక రాయలసీమలో కేసీ కెనాల్‌ కింద 2.65 లక్షల ఎకరాలు, ఎస్సార్బీసీ కింద 1.53 లక్షల ఎకరాలు, తెలుగుగంగ కింద 1.13 లక్షల ఎకరాల్లో ఇప్పటికే వరి సాగుచేశారు. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టులో ఇప్పటికే 80 వేల ఎకరాలలో వరి సాగుచేశారు. తెలుగుగంగ, పెన్నా డెల్టా, హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టులో వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఇలా.. శ్రీకాకుళం జిల్లా నుంచి దుర్భిక్ష అనంతపురం జిల్లా వరకూ ఏ ప్రాజెక్టు కింద ఆయకట్టును చూసినా వరి పైరుతో భూమికి పచ్చాని రంగేసిన తరహాలో కళకళలాడుతున్నాయి.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement