పవన్ కళ్యాణ్ పెళ్లిని ధృవీకరించిన రిజిష్ట్రార్ | Pawan Kalyan third marriage confirmed | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ పెళ్లిని ధృవీకరించిన రిజిష్ట్రార్

Published Sat, Dec 28 2013 5:21 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్ -  అన్నా లెజ్నెవా  వివాహం ధృవీకరణ పత్రం. ఇన్సెట్లో ఎర్రగడ్డ సబ్ రిజిష్ట్రార్ బాసిత్ సిద్ధిఖీ - Sakshi

పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా వివాహం ధృవీకరణ పత్రం. ఇన్సెట్లో ఎర్రగడ్డ సబ్ రిజిష్ట్రార్ బాసిత్ సిద్ధిఖీ

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడవ పెళ్లి చేసుకున్నట్లు సబ్ రిజిష్ట్రార్ ధృవీకరించారు. ఈ ఏడాది సెప్టెంబరు 30న పవన్ కళ్యాణ్ - ఆస్ట్రేలియా మోడల్  మోడల్ అన్నా లెజ్నెవా (డానా మార్క్స్) వివాహం జరిగినట్లు ఎర్రగడ్డ సబ్ రిజిష్ట్రార్ బాసిత్ సిద్ధిఖీ తెలిపారు. ఆ తేదికి నెల రోజుల ముందు వారు ఇద్దరూ వివాహం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తాము నోటీసు జారీ చేశామని చెప్పారు. ఆ నెల రోజులలో వారి పెళ్లికి అభ్యంతరం తెలుపుతూ ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. దాంతో సెప్టెంబర్ 30న వారికి వివాహం చేసినట్లు తెలిపారు. వారిది కులాంతర వివాహమని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ హిందు అని, అన్నా లెజ్నెవా క్రిస్టియన్ అని తెలిపారు.  స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారికి వివాహం చేసినట్లు ఆయన చెప్పారు. వివాహ ధృవీకరణ పత్రంలో కొణిదల పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా అని వారి పేర్లు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్-లెజ్నెవా సహజీవనం చేస్తున్నట్లు ఏడాది క్రితమే బయటకు తెలిసింది. అప్పటి నుంచి వారికి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వారు ధృవీకరించలేదు. ఖండించలేదు. ఇప్పుడు ఈ ధృవీకరణతో  వారి సహజీవనం, మూడవ పెళ్లి నిజమేనని స్పష్టమైంది.

 సినీ పరిశ్రమలో నటన పరంగా సంచలనాలు సృష్టించిన పవన్, పెళ్లి - సహజీవనం విషయంలో కూడా సంచలనాలు సృష్టించారు. మూడవ పెళ్లి మరో సంచలనం.  పెళ్లి - సహజీవనం- మళ్లీ పెళ్లి - మళ్లీ సహజీవనం - మళ్లీ పెళ్లి ... ఇలా సాగిపోతోంది ఆయన జీవితం.  పవన్ కళ్యాణ్ మొదట విశాఖకు చెందిన నందిని అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న తరువాత ‘బద్రి' చిత్రంలో తన సరసన హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్తో సహజీవనం చేశారు.

మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన  ఆమె కూడా మొదట మోడల్‌గానే తన కెరీర్ను ప్రారంభించారు. 2000లో  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  రూపొందిన ‘బద్రి' చిత్రంలో  పవన్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.  ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో సంచలనం. అప్పట్లో సహజీవనంపైన చాలా చర్చ కూడా జరిగింది.  పవన్తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు.  మళ్లీ 2003లో పవన్తోనే ‘జానీ' సినిమాలో నటించారు. వీరిద్దరికీ పెళ్లి కాకముందే 2004లో  అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది.

దాదాపు రెండేళ్ల నుంచి రేణుదేశాయ్-పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. రేణుదేశాయ్ దూరమైనప్పటి నుంచి పవన్ అన్నాలెజ్నెవాతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. 'తీన్‌మార్‌' చిత్రంలో పవన్ పక్కన అన్నాలెజ్నెవా ఒక పాటలో నటించారు. అప్పటి నుంచి వారి మధ్య  ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement