- 40 శాతం మందికే సబ్సిడీ విత్తనాలు
- మిగిలిన రైతులకు ప్రయివేటు విత్తనాలే దిక్కు
- 60 శాతం మందిపై కోట్లలో భారం
- 16.8 కోట్ల సబ్సిడీ కోల్పోతున్న రైతులు
- జిల్లాలో 1.36 లక్షల హెక్టార్లలో పంట సాగు
సాక్షి, చిత్తూరు: రైతులకు అండగా ఉండేది మా ప్రభుత్వమేనంటూ పదేపదే గొప్పలుపోయే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన కుదరడంలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. జిల్లాలో సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను 40 శాతం మంది రైతులకు మాత్రమే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్ ఉత్తర్వులు జారీచేసింది. మిగిలిన 60 శాతం మంది రైతులు విత్తనాలను ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధరలు చెల్లించి కొనుక్కోవలసిందే. దీంతో అన్నదాతలపై కోట్లాది రూపాయల భారం పడనుంది.
జిల్లాలో ఖరీఫ్‌లో 1.36 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ పంట సాగుచేస్తారు. గతంతో పోలిస్తే వర్షభావంతో ఏడాదికేడాది సాగువిస్తీర్ణం తగ్గుతోంది. సకాలంలో వర్షం కురిస్తే జూన్ నెలలో వేరుశెనగ సాగవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోమారు వర్షం కురిస్తే వేరుశెనగ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ వేరుశెనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో 40 శాతం మందికి మాత్రమే సబ్సిడీ విత్తనాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు 83 వేల క్వింటాళ్ల విత్తన కాయలను వ్యవసాయశాఖ కేటాయించింది. వీటిని ఆయిల్‌ఫెడ్ ద్వారా 25వేలు, ఆఖా ద్వారా 24వేలు, ఏపీసీడ్స్ ద్వారా 34వేల క్వింటాళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. మే 15 నుంచి జూన్ మొదటి వారంలోపు విత్తన కాయలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ లెక్కన 52 వేల హెక్టర్లకు మాత్రమే సబ్సిడీ విత్తనాలు అందనున్నాయి. మిగిలిన 84 వేల హెక్టార్ల సాగుకు ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధరలు వెచ్చించి విత్తనాలను కొనాల్సిందే. ఇది రైతులకు భారం కానుంది. ప్రస్తుతం ప్రభుత్వం కిలో *64.75 చొప్పున 30కిలోల బస్తా వేరుశెనగ కాయలను *1942కు కొనుగోలు చేస్తుంది. కిలోకు *21.37(33 శాతం) సబ్సిడీ ప్రకారం *641పోను బస్తా కాయలను *1301కు విక్రయిస్తోంది. ప్రైవేటు వ్యాపారులు 40కిలోల బస్తా విత్తనకాయలను * 2400 నుంచి 2500 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 30కిలోల బస్తా విత్తనకాయల ధర *1800 అవుతుంది. ప్రభుత్వ సబ్సిడీ లేకపోవడంతో బస్తా కాయలపై రైతులు *501లు నష్టపోతున్నారు. హెక్టారుకు నాలుగు బస్తాల కాయలకు *2 వేలు నష్టపోవాల్సి వస్తోంది.
మొత్తంగా జిల్లాలోని 84 వేల హెక్టార్ల పరిధిలో రైతులపై * 16.8 కోట్ల భారం పడుతోంది. ఇప్పటికే వేరుశెనగ రైతులు వరుస కరువుతో తీవ్రంగా నష్టపోయా రు. ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల సందర్భంగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని పదేపదే ప్రకటించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. సబ్సిడీ విత్తనాలైనా అందిస్తారనుకుంటే ప్రభుత్వం ఎగనామం పెట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వేరుశెనగ రైతుకు సర్కారు శఠగోపం
Published Tue, May 12 2015 3:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement