ఎవరూ మనల్ని పట్టించుకోవడం లేదనుకున్నారో ఏమో... ఏం చేసినా ఎవరూ గుర్తించరు అనుకున్నారో ఏమో... చనిపోయినవారి పేరుమీద వచ్చిన పింఛన్లు కాజేసినా ఎవరికీ తెలియదనుకున్నారో ఏమో... ఓ ఇద్దరు ఉద్యోగులు అక్రమానికి తెరతీశారు. అథంటికేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఆరు నెలలుగా చనిపోయినవారి పేరున పింఛన్లు తీసేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ఇప్పుడు వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది.
సాక్షి, బలిజిపేట(విజయనగరం) : బడుగులకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను ఓ ఇద్దరు ఉద్యోగులు పక్కదారి పట్టించేశారు. చనిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించకుండా... ప్రతి నెలా వారి పేరు న తీసేసుకుంటున్నారు. ఆరు నెలలుగా ఈ అక్రమం సాగుతోంది. బలిజిపేట మండలం గలావల్లిలో వెలుగు చూసిన సంఘటన ఇది. గలావల్లి పంచాయతీ పరిధిలోని కడగల రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102371602), చందక సంగయ్య(పెన్షన్ ఐడీ 102394294), మజ్జి రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102137032), రాగోలు రామయ్య(పెన్షన్ ఐడీ 102796572), గేదెలపేటకు చెందిన కొంచాడ సుందరమ్మ(పెన్షన్ ఐడీ 102404322), చందక రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102820571) 6 నెలల క్రితమే మృతి చెందారు. వారిపేర్లు జాబితా నుంచి తొలగించకపోవడంతో పింఛన్లు మంజూరవుతున్నాయి. ఆ మొత్తాలను ఇద్దరు ఉద్యోగులు దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. జూన్‌నెల పింఛన్ల పంపిణీ సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. రాగోలు రామయ్య డిసెంబర్‌లో పింఛ న్ తీసుకుని మృతి చెందినా ఆ పేరు తొలగించకపోవడంతో అతని పేరున పింఛన్ వచ్చేస్తోంది. అతని భార్య సుందరమ్మకు వితంతు పింఛన్ ఫిబ్రవరి నుంచి ఇస్తున్నారు. ఈ 6 నెలల వ్యవధిలో వ చ్చిన మొత్తాలు గ్రామ కార్యదర్శి మోహన్, రెండు నెలలుగా ఎంపీడీఓ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
టైపిస్టే సూత్రధారి
గలావల్లిలో మే, జూన్ నెలలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుంఇచ 10నుంచి 20రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పింఛన్ల ఫైలును తనవద్దే ఉంచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పింఛన్లు ఆన్‌లైన్ చేసేటపుడు చేతివాటం చూపుతున్నారని కూడా కొందరు చెబుతున్నారు. గతంలోనూ పెద్దింపేటలో 6, పలగరలో ఒకటి, అంపావల్లిలో 2, వంతరాంలో 2, అరసాడలో ఒకటి ఆథంటికేషన్ పద్ధతిలో కార్యదర్శులు విత్‌డ్రా చేసిన విషయం విదితమే. ఈ విషయం సోషల్ ఆడిట్‌ద్వారా బయటపడింది.
అథంటికేషన్ పేరుతో అక్రమాలు
రెండేళ్లుగా బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. లబ్ధిదారులు వేలిముద్రలు వేసి వారి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది. మంచంమీద ఉండేవారు, ఇతరత్రా రాలేనివారి వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ వేయించుకుని వారికి పింఛన్ పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పడక, ఐరిస్ అవక పింఛన్ పొందలేనివారికి పింఛన్లు పంపిణీ చేసేవారే అథంటికేషన్ వేసి మొత్తాలు అందజేస్తారు. ఈ విధంగా చేసేందుకు వారికి గ్రామపింఛన్ లబ్ధిదారుల మొత్తంలో 2శాతం వరకే అవకాశం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.
మరణ ధ్రువీకరణ నమోదు కాకే...
మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామ కార్యదర్శులే ఇస్తారు. మృతుడు ఎప్పుడు మృతిచెందాడో వారికి తెలుస్తుంది. వారికి సంబంధించిన సమాచారాన్ని 21రోజుల్లోగా కార్యదర్శి ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చనిపోయిన వారి పేరున మొత్తాలు మంజూరయ్యే అవకాశం ఉండదు. అయితే కావాలనే ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్ చేయకుండా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. దీనిపై ఈఓపీఆర్‌డీ దేవకుమార్‌వద్ద సాక్షి ప్రస్తావించగా టైపిస్ట్ ఎక్కడ పింఛన్లు పంపిణీ చేసినా మృత్యువాత పడినవారి పేరున వచ్చే వాటికి ఆథంటికేషన్ వేసి విత్‌డ్రా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తాము గుర్తించినట్టు తెలిపారు. అంతేగాకుండా పింఛన్లు పెట్టేందుకు కార్యాలయానికి వచ్చేవారి నుంచి వెయ్యి నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారనీ, పింఛన్లు పంపిణీ చేసే సమయంలోనూ లబ్ధిదారులనుంచి 10 నుంచి 20రూపాయలు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎంపీడీఓకు తెలియజేసినా ఆయన పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు గలావల్లిలో అక్రమాలకు పాల్పడినట్టు బట్టబయిలయిందని దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment