ఆర్టీసీ నష్టాల భారం ప్రజలపైనే!
సాక్షి, అమరావతి: ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతే అంతిమంగా ఆ భారం ప్రజలపైనే పడుతుందని సీఎం చంద్ర బాబు స్పష్టం చేశారు. ఆర్టీసీ నష్టాలు ప్రస్తుతం రూ.795 కోట్లకు చేరాయని, ఇప్పటికైనా సవాల్‌గా తీసుకొని నష్ట నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సీఎం ఆదేశించారు. గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలసి ముఖ్యమంత్రి రవాణా శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఆర్టీసీ బస్సుల్లో సీట్ల ఆక్యుపెన్సీ పెంచడంతో పాటు నాన్ టికెట్ రెవెన్యూ పెంచుకోవాలని సీఎం సూచించారు. కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శ కాల ప్రకారం 21 మందితో జిల్లా స్థాయిలో, 18 మందితో రాష్ట్ర స్థాయిలో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరముందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
సంక్షేమ శాఖల పనితీరుపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. బీసీ ఫెడరేషన్‌లలో సమర్థం గా విధులు నిర్వర్తించిన వంద మందిని త్వరలో కలుస్తానని చెప్పారు. అలాగే కులవృత్తుల వదిలి వేరే వృత్తుల్లోకి మారిన వారి వివరాలు తయారుచేయాలని ఆదేశించారు.
ఇక నేరుగా ఫిర్యాదు చేయొచ్చు..
ప్రజలు నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు, సూచనలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్రత్యేకం గా రూపొందించిన ‘కనెక్ట్ ఏపీ సీఎం’ యాప్‌ను సీఎం చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించనున్నారు.
త్యాగానికి క్రీస్తు ప్రతీక: చంద్రబాబు
శాంతి బోధనలతో ఏసుక్రీస్తు ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, త్యాగానికి ఆయన ప్రతీక అని సీఎం చంద్ర బాబు పేర్కొన్నారు. క్రీస్తుకు శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడేగా పాటిస్తున్నారని, ఇది ఎంతో పవిత్రమైన రోజు అని చెప్పారు. శాంతి, అహింసతోనే సమాజాభివృద్ధి సాధ్య మని, విశ్వమానవాళిని ప్రేమతో చూడాల న్నదే కరుణామయుని బోధనల సారమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.