దసరా అంటేనే అందరిలో ఓ ఆనందం. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు, రైతులు.
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: దసరా అంటేనే అందరిలో ఓ ఆనందం. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జరుపుకునే పండగ ఇది. ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు, రైతులు..ఇలా అందరిలోనూ విజయదశమి ఉత్సాహం నింపుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సారి ఆనందోత్సవాహాలు కరువయ్యాయి. ఉద్యోగులు, కార్మికులకు రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో పండగపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. సమ్మె కారణంగా అన్ని రకాల వస్తువుల ధరలు నింగినంటుతుండటంతో సామాన్య ప్రజలు సైతం సాదాసీదాగానే పండగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దసరా ఉత్సవాల్లో భాగ మైన విజయదశమి పండగకు ప్రత్యేకత ఉంది.
నూతన వ్యాపారాలను ప్రారంభించే వారితో పాటు గృహప్రవేశాలు, వివాహాలకు దసరా ముహుర్తాల్లోనే ప్రాధాన్యం ఇస్తారు. సైకిల్ నుంచి భారీ వాహనాల వరకు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్నింటికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. హిందువులతో పాటు మిగిలిన వర్గాల ప్రజలు కూడా ఈ పండగ నాడు ఆయుధాల పూజ నిర్వహిస్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న దసరాపై ఈ మారు సమైక్య ఉద్యమం తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు నెలలుగా అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
వివిధ రంగాల్లో పనిచేసే కూలీలకు ఉపాధి కరువైంది. వరుస బంద్‌ల నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక వ్యాపారులు నిత్యావసర సరుకులను పెద్దగా దిగుమతి చేసుకోలేదు. ఈ క్రమంలో అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉద్యోగులు, కార్మికుల చేతిలో నగదు లేకపోవడంతో పండగపై ఆసక్తి కనబచరడం లేదు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పండగకు సరుకులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ఎప్పుడూ దసరా సందర్భంగా కొనుగోలుదారులతో కిటకిటలాడే నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట ఈ సారి వెలవెలబోతోంది. సాధారణంగా దసరా సీజన్‌లో వారం రోజుల వ్యవధిలో రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు వ్యాపారాలు జరిగితే ఇప్పుడు మాత్రం రూ.20 లక్షల కూడా దాటలేదని వ్యాపారులు చెబుతున్నారు.
బోసిపోతున్న వస్త్రదుకాణాలు
ఏటా దసరా సందర్భంగా పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్ అందజేస్తాయి. చిరువ్యాపారులు సైతం తమ వద్ద పనిచేసే కార్మికులు దుస్తులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి మాత్రం వ్యాపారాలు లేకపోవడంతో పరిస్థితి తిరగబడింది. ఇటీవల నాలుగు రోజుల పాటు విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడంతో చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆదాయాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఈసారి బోనస్ అందజేసే విషయంలో వెనుకంజ వేశారు. మొత్తం మీద దసరా పండగ కళతప్పింది.