
ప్రజలను మభ్య పెట్టలేం: శైలజానాథ్
ప్రజలే నాయకులుగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఇకనైనా రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసైనా చంద్రబాబు పునరాలోచించుకోవాలి విజ్ఞప్తి చేశారు. ఓట్ల రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు.
గాదె వెంకటరెడ్డితో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని శైలజానాథ్ తెలిపారు. ప్రజలను మభ్య పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. మహోగ్రంగా సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతు పలకడమే తప్పా మభ్యపెట్టలేమన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు.
సమైక్యాంధ్ర కోసం తాము మాత్రమే చిత్తశుధ్దితో ప్రయత్నిస్తున్నామని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ నిర్ణయమని, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తమ పార్టీపై ఒత్తిడి తెస్తూనేవుంటామన్నారు.