నిలబడేందుకూ చోటులేని గోదావరి
దసరా పండక్కి సొంత ఊళ్లకు వచ్చి తిరిగి వెళ్లిన వారితో విశాఖ రైల్వేస్టేషన్ ఆదివారం రద్దీగా మారింది. ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రైళ్ల లోపల అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.రిజర్వుడు బోగీలు సైతం సాధారణ ప్రయాణికులతో కిటకిటలాడాయి.
విశాఖపట్నం, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): దసరా జోష్ ముగిసింది. పండగ కోసం సొంత ఊళ్లకు వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు తిరిగి ప్రయాణం అయ్యారు. దీంతో ఆదివారం విశాఖపట్నం రైల్వేస్టేషన్ రద్దీగా మారింది. ఏ ప్లాట్‌ఫారం చూసినా ప్రయాణికులతో కిటకిటలాడింది. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిక్కిరిపోయాయి. రైళ్ల లోపల అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ లేనంత నిండిపోయాయి. రైలు ఎక్కడమే ప్రయాణికులకు ఓ యుద్ధం అయింది.
మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర అవస్థలు పడ్డారు. పలువురు పురుషులు వేలాడుతూ ప్రయాణం చేయడం కనిపించింది. ముఖ్యంగా జన్మభూమి, రత్నాచల్, తిరుమల, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లు, రాజమండ్రి, కాకినాడ పాసింజర్‌లు గాలి దూరనంత కిక్కిరిసి వెళ్లాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కొత్త రైళ్లు ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటికైనా అదనపు బోగీలు అమర్చలేదు. దీంతో ప్రయాణికులు నరకం చూశారు. జనరల్ బోగీలతో పాటు రిజర్వుడు బోగీలు సైతం సాధారణ ప్రయాణికులతో కిటకిటలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment