
షర్మిల బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం
సమైక్యాంధ్రకు మద్దతుగా షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల సమైక్య శంఖారావం పేరిట చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ నేతలు వై.విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ, తోపుదుర్తి ప్రకాశరెడ్డి, తోపుదుర్తి భాస్కరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డిలు మాట్లాడారు.
షర్మిల యాత్రలో సమైక్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొనడం శుభపరిణామం అని వారు పేర్కొన్నారు.ఆమె చేపట్టిన బస్సుయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక టీడీపీ,కాంగ్రెస్ పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రపై తన వైఖరిని స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాతే బాబు ఆత్మగౌరవ యాత్రను ముందుకు కొనసాగించాలని సూచించారు.