వండేదెట్టా.. తినేదెట్టా..!
కర్నూలు(కలెక్టరేట్): మిరపకాయ ఘాటెక్కింది.. ఉల్లిగడ్డ కోయకండానే కన్నీరు తెప్పిస్తోంది..చింతపండు పులుపు తగ్గనంటోంది.. సన్న బియ్యం ఉడకనంటోంది..పెసరపప్పు అటకెక్కి దిగిరానంటోంది.. మండే ఎండలు పోయి వర్షాకాలం ప్రారంభమయినా.. కూరగాయల ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఆకాశన్నంటిన నిత్యావసర సరుకుల ధర దిగిరానంటున్నాయి.
ఫలితంగా జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారు పస్తులుండాల్సి వస్తోంది. జూన్ నెల గడిచినా వర్షాల జాడ లేకపోవడం కూరగాయల ధర పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం వంకాయ, బెండ పండుతోంది. టమాట, పచ్చి మిరప, బీర, క్యాబేజి, చిక్కుడు, బీట్‌రూట్ వంటి కూరగాయలన్నీ బెంగళూరు నుంచి దిగుమతి అవుతున్నాయి.
ఆలుగడ్డలు మాత్రం హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. గతంలో జిల్లా నుంచి అన్ని రకాల కూరగాయలు దేశం నలుమూలలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా దిగుమతి చేసుకోవాల్సి రావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ఈ ఏడాది కూరగాయల సాగు తగ్గినట్లు విమర్శలున్నాయి. ఎప్పటికప్పుడు కొరత ఏర్పడకుండా ఉద్యాన అధికారులు తగిన చొరవ తీసుకోవాలి. బావులు, బోర్లు, ఇతర నీటి పారుదల కింద కూరగాయల సాగును ప్రోత్సహించాలి.
ఇందుకోసం సబ్సిడీపై విత్తనాలను రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇవేమి చేయకపోవడంతో సాగు తగ్గి.. కూరగాయల కొరత వినియోగదారులను హడలెత్తిస్తోంది. ధరలు పెరుగుతున్న సందర్భంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంది. కూరగాయలు బాగా పండే ప్రాంతాల నుంచి తెప్పించి తక్కువ ధరలకు రైతు బజార్ల ద్వారా పంపిణీ చేయించాలి. జిల్లాలో ధరలు పెరిగిపోతున్నా.. వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.