ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళిక
Published Mon, Feb 17 2014 11:58 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్:
సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి అయిందని వెల్లడించారు. జిల్లాలోని 2,407 పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, మంచి నీళ్లు, టాయిలెట్లు, ర్యాంపుల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలకు ఈ పనుల బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఏడు పోలింగ్ కేంద్రాలకు ఒకరు చొప్పున సెక్టోరల్ అధికారిని నియమిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయడానికి యూనిఫాం అధికారులకు బాధ్యతలు అప్పగిస్తాన్నారు.
ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్ లాల్ సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్‌తో మాట్లాడుతూ కలెక్టర్ స్మితా సబర్వాల్ పై వ్యాఖ్యాలు చేశారు. అనంతరం ఆమె జిల్లాధికారులతో మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షకులుగా జిల్లాకు సుమారు 40 మంది సీనియర్ అధికారులను ఎన్నికల సంఘం పంపించనుందని తెలిపారు. ఎన్నికల ప్రకటన వెల్లడైన వెంటనే ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జేసీ శరత్, ఏజేసీ మూర్తి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement