అంతా పాస్ పేరుతో..ఫీజుల మాయ | Perutophijula ​​pass through the placenta | Sakshi
Sakshi News home page

అంతా పాస్ పేరుతో..ఫీజుల మాయ

Published Sat, Sep 6 2014 3:02 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

అంతా పాస్ పేరుతో..ఫీజుల మాయ - Sakshi

అంతా పాస్ పేరుతో..ఫీజుల మాయ

వైద్య, యంత్ర విద్య తర్వాత అంతటి ప్రాధాన్యమున్న కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ. అయితే నానాటికీ వృత్తి విద్య ప్రమాణాలు తీసికట్టుగా మారుతున్నాయి. జిల్లాలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఎంబీఏ కోర్సును కొత్త తరహా వ్యాపారంగా నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి. తరగతులకు రాకున్నా పర్వాలేదు.. పాస్ గ్యారెంటీ అంటూ హామీలు గుప్పిస్తున్నాయి.  ఇదంతా విద్యార్థులపై ప్రేమతో కాదు.. రీయింబర్స్‌మెంట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో కొన్ని కాలేజీల్లో సీట్లు భర్తీ కాకపోవడంతో ఎంబీఏపై అలాంటి ప్రభావం లేకుండా కొత్త వ్యూహంతో ముందుకెళుతున్నాయి.
 
సాక్షి, చిత్తూరు: జిల్లాలో సుమారు 27 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో కాలేజీలో 60-240 సీట్ల వరకు భర్తీ చేసుకునేందుకు ఏఐసీటీఈ అనుమతిస్తోంది. ఎంబీఏ.. రెండేళ్లు, ఎంసీఏ మూడేళ్ల కాలపరిమితిలో కోర్సు పూర్తవుతుంది. ఈ కళాశాలల్లో 10 వేలమంది వరకూ చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థికి 27 వేల రూపాయలు ఫీజు వాపసు కింద చెల్లిస్తోంది. జిల్లా మొత్తం సుమారు రూ.27 కోట్ల వరకు ఉంటుంది. ఇవి కాక యాజమాన్య కోటా కింద అనుమతిచ్చిన సీట్లలో 25 శాతం నేరుగా చేర్చుకునే అవకాశం ఉంది. అక్కడ వసూళ్లు అదనం.
 
అనుమతి ఒక చోట.. నిర్వహణ మరో చోట

ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఎక్కువగా అనుమతి లేని చోట నడుస్తున్నాయి. రెండున్నర ఎకరా స్థలంలో భవన సదుపాయాలుంటేనే అనుమతి వస్తుంది. పట్టణ శివార్లలో కొనసాగుతున్న కళాశాలలకు ఆ మేరకు స్థలాలున్నాయి. వీటికి అనుమతులున్నాయి. పట్టణాల్లోని ఉన్నవాటిల్లో  చాలా వాటికి అనుమతుల్లేవు. ఇరుకు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంజినీరింగ్ కళాశాలల గదుల్లోనే ఎంబీఏ తరగుతులు నిర్వహిస్తున్నారు. కోర్సులో చేరే విద్యార్థుల నుంచి ముందుగా యాజమాన్యాలు బిల్డింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇదేమని అడిగితే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వస్తే వాటిని ఇస్తామంటూ చెబుతున్నాయి. తీరా ఫీజు వచ్చాక ఆ నగదు చెల్లింపులు చేయడం లేదు.
 
నైపుణ్యం లేని అధ్యాపకులు

వృత్తి విద్యాకోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లో అనుభవం, నైపుణ్యం లేని అధ్యాపకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 60 సీట్లున్న కళాశాలలో ఒక ప్రొఫెసర్, 12 మంది వరకూ ఫ్యాకల్టీ అధ్యాపకులు ఉండాలి. ఎంబీఏ పూర్తి చేసిన వారికి అధ్యాపకులుగా ప్రాధాన్యమివ్వాలి. కానీ  పీజీ చేసిన వారిని ఎక్కువగా ఫ్యాకల్టీగా తీసుకుంటున్నారు.  తక్కువ చదువుకున్న వారితో నిర్వహిస్తే ఎక్కువ జీతం చెల్లించాల్సిన అవసరం లేదన్న వక్రమార్గంలో కొన్ని యాజమాన్యాలు వెళుతున్నాయి. మరికొన్ని కళాశాలలైతే అధ్యాపకుల ఏటీఎంలను తమ వద్దే ఉంచుకుంటున్నాయి.

ఎక్కువ జీతాలు ఖాతాలో వేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వాస్తవానికి అధ్యాపకుడి బ్యాంకు ఖాతాలో 50-70 వేల రూపాయల వరకూ వేస్తూ వెంటనే ఆ మొత్తాన్ని కళాశాలలే డ్రా చేసుకుంటున్నాయి. అధ్యాపకుని చేతిలో తక్కువగా 10-20వేల రూపాయలు పెడుతున్నారు. నిబంధనల మేరకు అధ్యాపకులకు జీతాలు ఇవ్వడం లేదు. ల్యాబ్ అసిస్టెంట్లను నియమించడం లేదు. ఈ విషయాలన్నీ అధ్యాపకులు ఁసాక్షి*తో చెప్పి బోరుమంటున్నారు. శ్రమదోపిడీ చేయించుకుంటున్నారని యాజమాన్యాలపై విరుచుకుపడుతున్నారు.
 
హాజరు లేకున్నా..

విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటే పరీక్షలకు అనుమతి ఉంటుంది. చాలావరకు కళాశాలల్లో ఈ పద్ధతి అమలు కావడం లేదు. విద్యార్థులు వచ్చినా రాకున్నా యాజమాన్యాలు హాజరు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కళాశాలల్లో అధ్యాపకుల కొరత, గదుల కొరత కారణంగా యాజమన్యాలు విద్యార్థుల హాజరు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఁమీ కెందుకు మేం పాస్ చేయిస్తాం* అని  హామీ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడం లేదు. ఈ రకంగా కళాశాలలే విద్యార్థులను పెడద్రోవ పటిస్తున్నాయనే విమర్శలున్నాయి.
 
మార్కులు మేమేస్తాం
 
ఈ కోర్సులు చదివే విద్యార్థులకు ఆయా కళాశాలలే ప్రయోగాలు నిర్వహిస్తాయి. ప్రాజెక్టు వర్కులుంటాయి. వీటికి 30 శాతం మార్కులుంటాయి. విద్యార్థి సామర్థ్యం, ప్రతిభతో పని లేకుండా ఈ మార్కులు వేస్తున్నారు. విద్యార్థులు ఉత్తీర్ణలయ్యేందుకు ఇవి చాలా వరకు దోహదపడుతున్నాయి. తరగతులకు హాజరైనా, కాకున్నా ఉత్తీర్ణత మాత్రం ఖాయమన్న నమ్మకంతో విద్యార్థులు విజ్ఞానాన్ని గాలికి వదిలేస్తున్నారు. 70 మార్కులకు వార్షిక పరీక్షలుంటాయి. వీటిల్లో కొంతమేర మార్కులు తెచ్చుకున్నా ఉత్తీర్ణత సాధించడం పెద్ద సమస్య కాదు. దాంతో విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.
 
ఐసెట్ ఉత్తీర్ణులారా జాగ్రత్త!:
 
త్వరలో ఐసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్షలు రాసిన విద్యార్థుల అడ్రస్‌లతో ఇప్పటి నుంచే యాజమాన్యాలు అడ్మిషన్ల వేట సాగిస్తున్నాయి. కేవలం డిగ్రీ కావాలంటే ఏదో ఒక కళాశాలలో చేరిపోవచ్చని, ప్రమాణాలతో కూడిన విద్యా కావాలంటే జాగ్రత్తగా విచారించుకునిమంచి కాలేజీని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అర్హతగల అధ్యాపకులున్నారో లేదో అన్ని రకాలుగా విచారించుకుంటే మంచిదని స్పష్టం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement