'పోలీసులతో నిర్బంధ అరెస్టులు చేయిస్తున్నారు'
గుంటూరు(మాచర్ల): టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలను వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలనసాగిస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాలపై పోలీసులను ప్రయోగిస్తూ నిర్బంధ అరెస్ట్‌లు చేయిస్తూ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. శనివారం గుంటూరు జిల్లా మాచర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్‌బూత్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారన్నారు. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులే అక్రమంగా ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయించడం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే జరిగిందని ఆరోపించారు.
గతంలో కూడా కర్నూలు కార్పొరేషన్ సమావేశంలో భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాలలో పార్టీని నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ పలు కుట్రలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. తనపై కూడా గతంలో చెన్నాయపాలెం భూముల విషయంలో అధికార పార్టీ వారు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు.