గేంబ్లింగ్ ఖిల్లా... | Poker is growing in the district of Den | Sakshi
Sakshi News home page

గేంబ్లింగ్ ఖిల్లా...

Published Wed, Aug 19 2015 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

జిల్లాలో పేకాట ఊపందుకుంటోంది... ఒకప్పుడు నగరశివారు పల్లెల్లోని తోటల్లో జోరుగా సాగే ఈ జూదం ఇప్పుడు పట్టణ నడిబొడ్డున ఉంటున్న హోటళ్లు...

జిల్లాలో పేకాట ఊపందుకుంటోంది... ఒకప్పుడు నగరశివారు పల్లెల్లోని తోటల్లో జోరుగా సాగే ఈ జూదం ఇప్పుడు పట్టణ నడిబొడ్డున ఉంటున్న హోటళ్లు... కల్యాణమండపాలకు విస్తరించింది. కుటుంబాలను నడిరోడ్డుకు నెట్టేసే ఈ జూదంకోసం పక్కజిల్లాలనుంచి కూడా పెద్ద ఎత్తున బడాబాబులు ఇక్కడకు రావడం విశేషం. ఇక్కడ ఎటువంటి పోలీసు దాడులు లేకపోవడం... స్వేచ్ఛగా ఆడుకునేందుకు అనుకూలంగా ఉండటమే కారణమని తెలుస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో శని, ఆదివారాలు వస్తే చాలు జూదం సందడి నెలకొంటోంది. వివిధ ప్రాంతాలనుంచి మందీ, మార్బలంతో ఇక్కడకు చేరుకుని చక్కగా హోటళ్లలో మకాం వేసి పెద్ద ఎత్తున పేకాటలో పాల్గొంటున్నారు. రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. రాత్రింబవళ్లూ తిరనాళ్లలా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి పేకాడుతున్న తొమ్మిదిమందిని పట్టుకుని వారినుంచి రూ. 9,110లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది ప్రకటనకే... లోపల పెద్దమొత్తంలోనే నగదు పట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
 
 సురక్షిత కేంద్రాలుగా హోటళ్లు
 పేరున్న హోటళ్లలో తనిఖీలకు వెళ్లాలంటే ముందస్తు సమాచారం తప్పనిసరి. కొన్ని హోటళ్ల సిబ్బంది స్థానిక పోలీసులతో కుమ్మక్కై తనిఖీల విషయం ముందుగానే తెలుసుకుంటున్నారు. రిసెప్షన్ సిబ్బందికీ ఇందులో వాటాలు వెళ్తున్నాయి. ఒక్కో హోటల్లో రోజుకు 5నుంచి 6గదులు పేకాటకే కేటాయిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులూ ఇందులో ఉంటున్నారు. కష్టార్జితాన్ని జూదంలో పెడుతున్నారు. హోటళ్లలో రూంలు బుక్ చేసుకుంటే సాధారణ అద్దె కంటే రెండింతల అద్దె చెల్లించాలి. అల్పాహారం, భోజనం అక్కడే చేయాలి. మందు సంగతి సరేసరి. గతంలో ఇళ్లలో ఆడిన విషయాన్ని పోలీసులు గుర్తించి రైడింగ్‌లు పెంచేసరికి ఇప్పుడు హోటళ్లకు మారింది.
 
  వీకెండ్‌లో హోటళ్లపై పోలీసులు దాడులు చేయడం పరిపాటే. సాధారణ రోజుల్లో అంతగా దృష్టిసారించకపోవడంతో జూదరాయుళ్లకు అనువుగా మారుతోంది. నరసన్నపేట, కోటబొమ్మాళి, విశాఖ, రాజాం, కొత్తూరు, భీమిలి ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు చేరుకుని కల్యాణమండపాలు, లాడ్జీలు, హోటళ్లలో చతుర్ముఖ పారాయణం నిర్వహిస్తున్నారు. పోలీసులు ఆయా ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో మామూళ్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆమదాలవలస, టూటౌన్, రణస్థలం, లావేరు పోలీసులకు సమాచారం ఉన్నా నాయకుల ఒత్తిళ్లతో దాడులు నిర్వహించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. తోటాడ-అక్కివరం ప్రాంతాల్లో సంతకం పెట్టి ముద్రతో ఉన్న టోకెన్లు విరివిగా లభ్యమవుతున్నాయని పోలీసుల వద్ద కూడా సమాచారం ఉంది.
 
 లొసుగులను ఆసరాగా చేసుకుని...
 పేకాడితే ఏపీ గేమింగ్ యాక్ట్ 9 ప్రకారం కేసు నమోదు చేస్తుంటారు. నేరం రుజువైతే రూ.100నుంచి రూ.1000వరకు అపరాధరుసుంతో పాటు నెలరోజుల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కాయిన్ల సరఫరా మూలాలు దొరికితే కేసు తీవ్రత ఉంటుంది. వాహనాలు పట్టుబడినా చట్ట ప్రకారం వెనక్కు ఇచ్చేయాలి. ఇదే వారికి ఆసరాగా మారుతోంది. సీఆర్‌పీసీ 41 ప్రకారం నోటీసులిచ్చి మరుచటి రోజు బెంచ్ కోర్డులో హాజరుపరుస్తున్నామని ఓ పోలీసు అధికారి చెప్పారు. పేకాట కేసుల్లో పట్టుబడిన వ్యక్తులు చెబితేనే ఆ ప్రదేశంలో ఎంత మొత్తం దొరికిందీ తెలుస్తుంది. లేకపోతే భారీ మొత్తాలు దొరికినా తక్కువ మొత్తాలకే పోలీసులు లెక్క చూపిస్తుంటారు.
 
 ప్లాస్టిక్ కాయిన్లకు కొరతలేదు
 రణస్థలం ప్రాంతాల్లో కార్లలో వచ్చే జూదరులు ముందుగా ఓ వ్యక్తి నుంచి రూ. 5000, 10వేలు, 25వేల ఖరీదు చేసే ప్లాస్టిక్ కాయిన్లు కొనుగోలు చేస్తుంటారు. డబ్బుకు బదులు కాయిన్లను ఉపయోగించి సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ఆటలో గెలిచిన వ్యక్తులు డెన్‌ల నిర్వహకులకు ఆయా కాయిన్లిచ్చి సొమ్ము పట్టుకెళ్తుంటారు. శివార్లలోని తోటల్లో పేకాడుతుంటారు. ఇందుకోసం భారీగా నిరుద్యోగుల్ని నియమించి పోలీసుల సమాచారం తెలుసుకోవడం, ఎవరైనా తిరగబడి తే అదుపుచేయిస్తుంటారు. ఆటలో ఒక్కో ‘కట్టుకూ’ భారీగా ఖర్చుల కోసం వసూలు చేస్తున్నారన్న సమాచారం స్థానిక పోలీసులకు తెలుసు. ‘రమ్మీ’ పేరుతో ‘కోత’ ఆట నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
 
 పేకాట కేంద్రాలు :
 పాలకొండ రోడ్డు, అరసవల్లి, దూసి(రైల్వేగేటుముందు గెడ్డ సమీపంలోని జీడితోటలవద్ద), రణస్థలం, ఎచ్చెర్లలోని ఓ దేవాలయం సమీపంతోపాటు తోటలు, ఎల్‌బీఎస్ కాలనీలోని శివారు ప్రాంతాలు, గూనపాలెంలో భారీగా డెన్‌లు నిర్వహిస్తున్నారు.
 
 ఫిర్యాదులొస్తే దాడులకు పంపిస్తున్నాం
 పేకాటకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదొచ్చినా స్పందిస్తున్నాం. దాడుల్ని ముమ్మరం చేయిస్తున్నాం. కొన్ని చోట్ల క్లబ్బుల్లో కేవలం సభ్యులే రమ్మీ ఆడేందుకు అనుమతి ఉన్నా ఇతరులు వేరే ఆటలకు ప్రాముఖ్యతనిస్తున్నారన్న ఫిర్యాదులొస్తున్నాయి. విచారణకు సిబ్బందిని పంపిస్తున్నాం. పేకాడి కష్టాన్ని చేజార్చుకోవద్దని కౌన్సెలింగ్ చేస్తున్నాం. కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిఘా ముమ్మరం చేస్తాం.            
 - ఎ.ఎస్.ఖాన్, జిల్లా ఎస్పీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement