కలెక్టరేట్ రణరంగమైంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన ఐకేపీ యానిమేటర్ల(వీవోఏ)పై పోలీసులు లాఠీ ఝళిపించారు.
చిలకలపూడి (మచిలీపట్నం) : కలెక్టరేట్ రణరంగమైంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన ఐకేపీ యానిమేటర్ల(వీవోఏ)పై పోలీ సులు లాఠీ ఝళిపించారు. 48 గంటలుగా దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ గేటు దాటి లోపలకు వెళ్లిన వారిని విచక్షణారహితంగా తోసివేశారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులే వీవోఏల్లోకి జొరబడి తోసివేసి, లాఠీచార్జ్ చేయడం గమనార్హం. ఈ ఘటనలో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ఓవైపు వీవోఏల అరుపులు, మరో వైపు పోలీసుల బూతుపురాణంతో కలెక్టరేట్ మారుమోగింది.
మహిలళపై లాఠీచార్జి చేసి వారిని బయటకు నెట్టివేసిన పోలీసులు దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ను సైతం కూల్చివేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌లోకి వెళ్లనివ్వాలని కోరిన వీవోఏలను పోలీసులు రోప్ పార్టీతో అడ్డుకున్నారు. రోప్‌పార్టీ, పోలీసులను నెట్టివేసిన వీవోఏలు కలెక్టరేట్‌లోకి వెళ్లడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో ఆగ్రహించిన వీవోఏలు ‘మీ అక్కచెల్లెళ్లు, భార్యలను ఇలాగే కొడతారా? మహిళా పోలీసులను తీసుకురాకుండా మగ పోలీసులే దాడికి పాల్పడతారా?’ అంటూ వీవోఏలు ఎదురు తిరి గారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.సీహెచ్.శ్రీనివాస్‌ను పోలీసులు కాళ్లు, చేతులు పట్టుకుని వంద గజాల దూరం మేర తీసుకువెళ్లి అక్కడి నుంచి గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
దీక్ష చేస్తున్న వీవోఏలను చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో వీవోఏలు ఎదురుతిరగటంతో తీవ్ర తోపులాట జరి గింది. ఈ తోపులాటలో మహిళలను కూడా చూడకుండా నెట్టివేయటంతో బొల్లి వెంకటలక్ష్మి స్పృహతప్పి పడిపోయింది. మరో వీవోఏ అలేఖ్య కాలు గ్రిల్‌లో ఇరుక్కుపోవటంతో ఆమె విలవిల్లాడింది. వీవోఏలు రజని, అన్నపూర్ణ గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో ఓఎస్‌డీ వృషి కేశవరెడ్డి, బందరు డీఎస్పీ కె.శ్రీనివాసరావుతోపాటు పట్టణంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, రిజర్వు పోలీసులు భాష్పావాయువు గోళాలు ప్రయోగించే పోలీసులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వీవోఏలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మైక్‌లో పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన బందరు డీఎస్పీ శ్రీనివాసరావు పని, పాటా లేదా అంటూ వారిపై విరుచుకపడి మైక్ లాగి దూరంగా విసిరేశారు. అయినప్పటికీ దీక్ష విరమించేది లేదని వీవోఏలు భీష్మించారు. వీవోఏలపై దాడి విషయం తెలుసుకున్న సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, సీఐటీయూ అధ్యక్షుడు రమణ, పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం వీవోఏలు, పోలీసులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నంచేశారు.
డీఎస్పీ కలెక్టరేట్ బీ-సెక్షన్ సూపరింటెండెంట్ డి.కోటేశ్వరరావుకు వద్ద కొంత మంది వీవోఏలను తీసుకువచ్చి వారి సమస్యలను వివరించారు. అనంతరం గేటు బయట దీక్ష చేస్తున్న వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇవ్వటంతో వారు దీక్ష విరమించారు. ధర్నాలో జిల్లా శ్రామిక మహిళా జిల్లా కన్వీనరు ఎన్.సీహెచ్.శ్రీనివాస్, వీవోఏల సంఘ జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎ.కమల, ప్రధాన కార్యదర్శి ఎం.ఆదిలక్ష్మి, 39 మండలాల వీవోఏలు పాల్గొన్నారు.