ఒడిశా సరిహద్దు ముంచంగిపుట్టు ప్రాంతంలో తనిఖీలు జరుపుతున్న పోలీసులు
విశాఖపట్నం, అరకులోయ, పాడేరు, సీలేరు(పాడేరు): ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా నిరసన వారాన్ని చేపడుతున్న మావోయిస్టులు ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో సృష్టించిన అలజడి, విధ్వంసంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనగా వారాన్ని విజయవంతంగా నిర్వహించిన మావోయిస్టులు గురువారం భారతబంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందనే సమాచారం ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏవోబీ వ్యాప్తంగా ఆందోళకర పరిస్థితులు నెలకొన్నాయి. 10 రోజుల నుంచి ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు ఏవోబీలో గాలింపు చర్యలను మమ్మురం చేసినప్పటికీ మావోయిస్టులు మాత్రం ఏవోబీలో రెండు చోట్ల గిరిజనులతో బహిరంగ సమావేశాలు నిర్వహించి తమ ఉనికిని చాటుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం ఓ బస్సును దహనం చేసిన మావోయిస్టులు, విశాఖ, తూర్పుగోదావరి అంతర్‌రాష్ట్ర రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీని కాల్చివేశారు. దీంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు గోదావరి ప్రాంతాల పోలీసులు ఉలిక్కి పడ్డారు.
ఓ వైపు పోలీసు పార్టీలు అడవిలో జల్లెడపడుతున్నా మావోయిస్టులు ఏవోబీలో నిరసన వారోత్సవాలను నిరాటంకంగా నిర్వహించారు. విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మావోయిస్టులు బడిమెల రిజర్వాయర్ పరిధిలోని కటాఫ్ ఏరియాలో తలదాచుకుంటున్నారనే అనుమానంతో ఒడిశా పోలీసు బలగాలు కూడా విశాఖ ఏజెన్సీ సరిహద్దు వరకు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మంగళవారం ముంచంగిపుట్టు మండలంలోని ఒడిశా సరిహద్దు బూసిపుట్టు వారపుసంత ప్రాంతంలోను పోలీసు పార్టీలు అధికంగా సంచరించాయి. రూడకోట అవుట్‌పోస్టు పరిధిలోను కూంబింగ్‌ను విస్తృతం చేశారు. పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు పార్టీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ మండలాలు ఒడిశా సరిహద్దులో ఉండడంతో పోలీసులు తమ తనిఖీలను మమ్మురం చేశారు. హుకుంపేట,డుంబ్రిగుడ,అరకులోయ,అనంతగిరి స్టేషన్ల పరిధిలోను పోలీసుల నిఘా అధికమైంది.పలు మండల కేంద్రాల్లో సీసీ కెమెరాలను పోలీసుశాఖ ఏర్పాటు చేయడంతో సంబంధిత స్టేషన్ల అధికారులు అనుమానిత వాహనాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. నర్సీపట్నం ముఖద్వారం నుంచి సీలేరు మీదుగా అన్ని ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాడేరు–జి.మాడుగుల ప్రధాన రహదారిలోని సెయింటాన్స్ స్కూల్ జంక్షన్‌తో పాటు ప్రధాన జంక్షన్‌ల వద్దపాడేరుఎస్‌ఐ రామారావు బుధవారం తనిఖీలు నిర్వహించా రు. ఆ మార్గంలో రాకపోకలు సాగిçస్తున్న ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆపి నిశితంగా పరిశీలించి అనుమానితులను ప్రశ్నించి విడిచిపెట్టారు. వాహన పత్రాలు తనిఖీ చేశారు.
పోలీసు స్టేషన్ల వద్ద నైట్ హాల్ట్ బస్సులు
మావోయిస్టులు భారతబంద్ పిలుపుతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్. కోట నుంచి అరకులోయ,కించుమండ ప్రాంతాలకు నడిచే నైట్‌హల్ట్ బస్సులను డుంబ్రిగుడ, అరకులోయ పోలీసు స్టేషన్ల వద్ద పార్కింగ్ చేయాలని, అలాగే పాడేరు డిపో నుంచి జోలాపుట్ నడిచే రాత్రి బస్సులను ముంచంగిపుట్టు పోలీసుస్టేషన్ వద్ద ఉంచా లని ఆర్టీసీ అధికా రులు నిర్ణయించా రు. మారుమూల ప్రాంతాలకు గురువారం బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.
విద్యుత్ కేంద్రాలకు భద్రత
సీలేరు(పాడేరు): మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఏపీ జెన్‌కో ఆస్తులకు భద్రత కల్పించారు. మావోయిస్టులు గత రెండు రోజుల్లో బస్సులు, లారీని దహనం చేశారు. విద్యుత్ కేంద్రాలను గతంలో మావోయిస్టులు దహనం చేసిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం వంటి జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్‌ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆయా దారి గుండా వెళ్లే వ్యక్తులను తనిఖీ చేసి విడిచిపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment