పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీకి తీవ్ర అవమానం!
విజయవాడ: శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీకు తీవ్ర అవమానం జరిగింది. సోమవారం ఉదయం ఆయన కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముఖ‍్యమంత్రి ఈ మార‍్గంలో వస్తున‍్నందున ఎమ్మెల్యే శివాజీ వెళ‍్ళేందుకు వీలులేదని పోలీసులు ఆపేశారు. దాంతో ఆయన పోలీసుల వైఖరిని నిరసిస్తూ కరకట‍్ట దగ‍్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నాకు దిగారు.
అయితే పోలీసు ఉన‍్నతాధికారులు శాసనసభ‍్యునికి నచ‍్చజెప్పి ఉండవల్లి మార‍్గంలో శాసనసభకు పంపించారు. దాంతో పాలీసుల వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ‍్యక‍్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోకుంటే ఈ ఘటనపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే శివాజీ తెలిపారు.
కాగా గతంలోనూ ఎమ్మెల్యే శివాజీకి ఇటువంటి ఘటనలే ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను హెలిప్యాడ్ వద్దకు పోలీసులు అనుమతించలేదు. దాంతో శివాజీ అక్కడే నిరసనకు దిగిన విషయం తెలిసిందే.