
నంద్యాలలో వేగంగా మారుతున్న పరిణామాలు
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కాసేపట్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన వారితో చర్చించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ కార్యకర్తలు,అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నిన్న తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. శిల్పా చక్రపాణితో టీడీపీ నేతలు సీఎం రమేష్, కాల్వ శ్రీనివాసులు, బీటెక్ రవి మంతనాలు జరిపి, బుజ్జగించే యత్నం చేశారు. మరోవైపు వైఎస్‌ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి కూడా శిల్పా చక్రపాణితో భేటీ అయ్యారు.
కాగా శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన తర్వాత గత కొద్ది రోజులుగా టీడీపీ శిల్పా చక్రపాణి రెడ్డిని అనుమానిస్తోంది. పలు సందర్భాల్లో ఆయనను అవమానిస్తూ వస్తోంది. ముఖ్యంగా జిల్లాల్లో ఆయన పేరును చెడగొట్టే పనులు టీడీపీ పలుమార్లు చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొనలేదు. ఇప్పటికే శిల్పా చక్రపాణి రెడ్డి, భూమా అఖిల ప్రియల మద్య అంతర్యుద్ధం జరుగుతోంది. తాజాగా శిల్పా చక్రపాణిరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.