పార్టీలన్నీ యూటర్న్ తీసుకున్నాయి: జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోయిందని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రం మరింత కష్టాల్లో కూరుకుపోకుండా కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంభిచడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు. పార్టీలు స్పష్టమైన విధానం అవలంభిచకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డుచెప్పబోమని లేఖలు ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం వచ్చిన తర్వాత పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని అన్నారు. హైదరాబాద్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య సభ పెట్టడం ఇబ్బందికర పరిణామమని జయప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.