= పొంచి ఉన్న మరో తుపాను
= 48 గంటలపాటు వర్షాలు
= 12వతేదీ వరకు ప్రభావం
= రైతుల్లో ఆందోళన
మచిలీపట్నం/ కోడూరు, న్యూస్‌లైన్ : వాయవ్య బంగాళాఖతంలో ఏర్పడిన ‘మాది’ తుపాను బలపడి మరో 24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం ఒక్కసారిగా మేఘవృతమై చల్లని గాలులు వీయడంతో ఏప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు హడలిపోతున్నారు.
ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకు500 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను మన భూభాగం వద్ద తీరం దాటే అవకాశం లేకున్నా.... దీని ప్రభావంతో కోస్తా తీరంలో ఒక మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం జిల్లాపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.
చిరుజల్లులతో బెంబేలు ...
తుపాను ప్రభావంతో శనివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమైఉంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడ్డాయి. తుపాను ప్రభావం 12వ తేదీ వరకు ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో రైతులు బెంబేతెత్తిపోతున్నారు. వరికోతలు ఊపందుకున్న నేపథ్యంలో వర్షాలు కురిస్తే మరింతగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. గత నవంబరులో సంబవించిన లెహర్, హెలెన్ తుపానుల తాకిడికి అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి,బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, గుడివాడ, కైకలూరు, కలిదిండి తదితర మండలాల్లో దాదాపు 2.25 లక్షల ఎకరాల్లోవరి నేల వాలి నీటమునిగి పాడైపోయింది.
జిల్లా వ్యాప్తంగా వరి కోతలు లక్ష ఎకరాల్లో పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దాదాపు 70వేల ఎకరాల్లో వరిపంట పనలపై ఉంది. దాదాపు 5.34 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉంది. ఈతరుణంలో వర్షం కురిస్తే తమకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రైతులు భయపడిపోతున్నారు. ‘‘మాది’’ తుపాను ప్రభావంతో మరిన్ని వర్షాలు కురిస్తే వరిసాగు చేసిన రైతులు పంటపై ఆశ వదులుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి ‘మాది’ గండం!
Published Sun, Dec 8 2013 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement