
సానుకూలం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల నేతృత్వంలో ప్రకాశం జిల్లా నుంచి రైతు ప్రతినిధి బృందం గురు, శుక్రవారాల్లో కేంద్ర మంత్రులను కలిసి జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శుక్రవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాటు రాష్ట్రానికి చెందిన మంత్రి వెంకయ్యనాయుడిని కూడా కలిసి చర్చించారు. నిర్మలా సీతారామన్ సుమారు గంట సేపు రైతుల బృందంలో మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు.
వారం రోజుల్లో కేంద్రం నుంచి ఒక బృందాన్ని పంపిస్తామని, అ బృందం ఇచ్చిన సూచనల ఆధారంగా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చారు. నిర్మలాసీతారామన్‌ను కలిసిన వారిలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉండగా, వెంకయ్యనాయుడిని కలిసిన సమయంలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా హాజరయ్యారు. అనంతరం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షితో మాట్లాడుతూ మరోవారం రోజుల్లో పొగాకు రైతుల సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం తమకు కలిగిందన్నారు. కేంద్రమంత్రులు స్పందించిన తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.