
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం అర్హుల జాబితా దాదాపు ఖరారైంది. ఎంపికైన వారికి ఈ నెలాఖరులోగా సాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 45 నుంచి 60 సంవత్సరాల్లోపు వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మొత్తాలతో వారు చిన్నపాటి వ్యాపారం చేసుకునేందుకు అనువుగా నిబంధనలు రూపొందించి ఆ వర్గాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హుల జాబితాలను పరిశీలించి సోమవారం తుది జాబితాను ప్రకటించనుంది. తమకు ఆస్తులు లేకపోయినా, ఉన్నట్టుగా వార్డు వలంటీర్లు నమోదు చేశారని.. వాస్తవాలకు భిన్నంగా ఆదాయం ఉన్నట్టు నమోదు చేశారని పేర్కొంటూ వాటికి సంబంధించిన ఆధారాలను కొంత మంది సమర్పిస్తున్నారు. వీటిలో వాస్తవాలు ఉంటే వారిని మళ్లీ అర్హుల జాబితాలో చేరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 2,56,843 దరఖాస్తులు అందగా, అందులో 2,29,416 మందికి అర్హత ఉన్నట్లు గుర్తించారు. తుది పరిశీలన అనంతరం అర్హుల సంఖ్య మరింత పెరగనుంది.
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
- ఎన్నికల సమయంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి తెగలకు అన్ని రకాలుగా సాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రకటించారు.
- 2020 మార్చి నుంచి 2024 మార్చి వరకు ఐదు సంవత్సరాలపాటు ఈ పథకం కొనసాగించడానికి రూ.1,101 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
- ఎంపికైన లబ్ధిదారులకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదు సంవత్సరాలకు రూ.75 వేలు అందించనుంది.
- ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల్లోపు వయసు కలిగిన కాపు మహిళలు ఆరు లక్షల మంది ఉన్నారు. వీరిలో అర్హులందరికీ సర్కారు సాయం అందించనుంది.
- తొలి ఏడాది ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం రూ.350 కోట్లను సిద్ధం చేసింది.