సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో ప్రజాప్రతినిధుల పాలనకు తాత్కాలికంగా తెరపడింది. రాష్ట్రపతి పాలన అమల్లోకి రావడంతో పాలనపై సర్వాధికారాలు గవర్నర్ చేతుల్లోకి వెళ్లాయి. దీంతో జిల్లాలో కలెక్టర్, ఎస్పీలే కీలకం కానున్నారు. పాలనా వ్యవహారాల్లో పూర్తి అధికారాలు, బాధ్యతలు వారి చేతుల్లోకి వెళ్లాయి. శాసనసభ సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యేలు పదవుల్లో కొనసాగుతున్నా, ప్రజలకు మాత్రం అధికార యంత్రాంగమే జవాబుదారీ కానుంది. రాష్ట్రపతి పాలనలో పనిచేయడం కొత్తగా, ఆసక్తిగా ఉందని జిల్లా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి అన్ని అంశాలపై స్పష్టమైన ఆదేశాలు వస్తే గానీ పాలనా తీరు ఎలా ఉంటుందో చెప్పలేమని జిల్లా ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు అనేక ఇబ్బందులు పడిన అధికారులకు ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు తప్పనున్నాయి.
సారయ్య నియోజకవర్గానికే పరిమితం..
రాష్ట్ర మంత్రి వర్గం రద్దు కావడంతో బస్వరాజు సారయ్య మాజీ మంత్రి అయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఆయన ఇకపై తన నియోజకవర్గం వరంగల్ తూర్పునకే పరిమితం కానున్నారు. జిల్లా అధికార యంత్రాంగంపై ఈ మంత్రి అజమాయిషీ చేయడానికి అవకాశం ఉండదు. ఇక నుంచి జిల్లాలో ఎలాంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వీల్లేకుండా పోయిం ది. ఎన్నికలు సమీపిస్తుండటంతో నెల రోజులుగా జిల్లాలోని ప్రజాప్రతినిధు లు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మునిగితేలారు. ఇప్పుడు ఇన్‌చార్జి మంత్రి జిల్లాలో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. సాధారణంగా ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించాక ఈ పరిస్థితులుంటాయి. కానీ రాష్ట్రపతి పాలన కారణంగా షెడ్యుల్ రాకముందే ఇలాంటి పరిస్థితి నెలకొనడం గమనార్హం.
అడుగులకు మడుగులొత్తితే ఇక అంతే..
అధికార యంత్రాంగానికి ఇప్పుడు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కొద్ది రోజులైనా పనిచేసే అవకాశం లభించింది. ఈ సమయంలోనైనా జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో అనేక మంది అధికారులు నేతల చెప్పు చేతల్లో పనిచేశారనే విమర్శలున్నాయి. ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తిన ఓ అధికారిపై సరేండర్ వేటు పడిన విషయం విధితమే. ఇప్పుడు అధికారులు ఇలాంటి వ్యవహారాలకు మరింత దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరికి అనుకూలంగా వ్యవహరించడం, బిల్లులు, ఇతర పాలనా వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడితే గవర్నర్ దృష్టికి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో కఠిన చర్యలుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారులే సుప్రీం
Published Sun, Mar 2 2014 12:33 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement