సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఆర్టీసీ కూడా పది రోజులుగా సమ్మెలోనే ఉండడంతో ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. పది రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రైవేటు బస్సులే దిక్కయ్యాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నారు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఆర్టీసీ కూడా పది రోజులుగా సమ్మెలోనే ఉండడంతో ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. పది రోజులుగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రైవేటు బస్సులే దిక్కయ్యాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నారు. సాధారణ రోజుల్లో చార్జీలకన్నా రెట్టింపు వసూలుచేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లాలంటే అధిక రేటు చెల్లించడం పక్కనబెడితే, సిఫారసులుంటే కానీ టికెట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సులు నడిచేటప్పుడు పోటీపడి మరీ తక్కువ రేట్లకు ప్రయాణికులను తీసుకెళ్లిన ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పుడు జబర్దస్తీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వీళ్లు రాత్రిపూట మాత్రమే బస్సులను హైదరాబాద్, చెన్నై, వైజాగ్, బెంగళూరు తదితర దూరప్రాంతాలకు నడుపుతున్నారు. ప్రయాణికులు టెన్షన్ పడేలా బస్సులు బయలుదేరే గంటముందు వరకు టికెట్లు జారీచేయకుండా, చివరి నిమిషంలో అధిక రేట్లు వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
గత్యంతరం లేకప్రైవేటు ప్రయాణం..
నిత్యం విజయవాడ నుంచి హైదరాబాద్ తదితర నగరాలకు ఆర్టీసీ 220 బస్సులను నడిపేది. ఆర్టీసీకి సమాంతరంగా 20 ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు 200 బస్సులు నడిపేవి. సమ్మెకు ముందు అన్‌సీజన్‌లో హైదరాబాద్‌కు ప్రైవేటు ఆపరేటర్లు రూ. 150 నుంచి రూ. 200 వరకు వసూలు చేసేవారు. సీజన్‌లో అయితే రూ.400 వసూలు చేస్తుంటారు. పది రోజులుగా ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్ వోల్వోకు రూ. 600 నుంచి రూ.800 వరకు వసూలుచేస్తున్నారు. స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్‌కు రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు దూరప్రాంతాలకు ఎక్కువగా వెళ్లడం లేదు. హైదరాబాద్‌కు మాత్రం అత్యవసర పనులు, వైద్యం కోసం వెళ్లే వారు మాత్రమే ప్రైవేటు బస్సులను తప్పనిసరి పరిస్థితిలో ఆశ్రయిస్తున్నారు. అప్పటికప్పుడు ప్రయాణమయ్యేవారికి రైలు టికెట్లు లభించడం గగనంగా మారింది. రెండు నెలలు ముందుగానే టికెట్ల బుకింగ్ పూర్తి కావడంతో ప్రయాణికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు.
కోదాడ వరకు కార్లల్లో..
ఎక్కువ డబ్బు చెల్లించినా ప్రైవేటు బస్సుల్లో సీట్లు లభించకపోవడంతో కొంతమంది ప్రయాణికులు లారీలు, కార్లు, జీపులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు రూ.200 చెల్లించి ఈ వాహనాల్లో కోదాడ చేరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయని హైదరాబాద్‌కు తరచుగా వెళ్లే వారు చెబుతున్నారు. కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కడం వల్ల ఖర్చు కొంత కలిసి వస్తోందని, కేవలం ఐదు వందలకే హైదరాబాద్ చేరుకోగలుగుతున్నామని చెబుతున్నారు.
ప్రైవేటు ఆపరేటర్లపై
ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం
ఆర్టీసీ బస్సులు సమ్మెలో పాల్గొనడాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆపరేటర్లు దోపిడీ చేయడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. శ్రావణమాసంలో ఆర్టీసీకి కాసులవర్షం కురిసేదని, దాన్ని తాము వదులుకున్నామని చెబుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లు తమకు ఎందుకు సహకరించని నిలదీయడమే కాకుండా ప్రైవేటు బస్సుల్ని అడ్డుకుంటున్నారు. దండిగా డబ్బులు రావడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. రవాణా, పోలీసు శాఖ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు, ట్యాక్సీల దోపిడీపై దృషి సారించిన పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ప్రైవేటు ఆపరేటర్లపై దృష్టి సారించి అక్రమ దోపీడిని అరికట్టాలని కోరుతున్నారు