సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల కరెస్పాండెంట్లు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశమైన కరెస్పాండెంట్లు సభను విజయవంతం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అంద జేయడానికి ముందుకు వచ్చారు.
పేద విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయంతో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజు ఈయింబర్స్‌మెంట్ పథకం వల్ల ఎంతో మంది ప్రయోజనం పొందారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగితే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించ లేక నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కూడా దెబ్బ తింటాయనే ఆవేదన కూడా సమావేశంలో వ్యక్తం అయింది. ఈ సమావేశానికి పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హాజరయ్యారు. ప్రయివేటు విద్యాసంస్థల నుంచి పి.మదన్‌మోహన్‌రెడ్డి, బి.ప్రసాదరాజు, హరిప్రసాద్, వెంకటేష్‌నాయుడు, గంగిరెడ్డి, జయచంద్రారెడ్డితో సహా పలువురు హాజరయ్యారు.