అపెరల్‌కు ఎసరు | Problem to apparel park place | Sakshi
Sakshi News home page

అపెరల్‌కు ఎసరు

Published Tue, Mar 6 2018 7:03 AM | Last Updated on Tue, Mar 6 2018 7:03 AM

Problem to apparel park place - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చేనేతల అభ్యున్నతి కోసం అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరు సమీపంలో అపెరల్‌పార్కును ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా రూ. 5.58 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవాలని భావిస్తోంది. ఇదే  జరిగితే ఈ ప్రాంతంలో గార్మెంట్స్, హ్యాండ్‌లూమ్‌ పరిశ్రమల ఏర్పాటుతో చేనేతలను ఆదుకోవాలన్న వైఎస్‌ సంకల్పం నెరవేరకుండా పోతుంది. 

సాక్షి ప్రతినిధి, కడప :  ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన అపెరల్‌ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేయకపోగా.. ఇప్పుడా స్థలంలో కొంత భాగం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవర్‌లూమ్, డైయింగ్, హ్యాండ్‌లూమ్‌ పరిశ్రమలతోపాటు గార్మెంట్స్‌ తయారీ యూనిట్ల కోసం ఈ స్థలాన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేటాయించారు. ఆ మేరకు ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. 76.17 ఎకరాల స్థలంలో అపెరల్‌ పార్కు ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 15 నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ప్లాట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 47 ప్లాట్లను ఏర్పాటు చేశారు. పార్కు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి.. అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. 

పార్కు స్థలంపై పలువురి కన్ను... 
అపెరల్‌ పార్కు స్థలంపై పలువురు కన్నేశారు. దశాబ్ద కాలంగా  పనులు ముందుకు సాగకపోవడం.. అత్యంత విలువైంది కావడంతో దానిని హస్తగతం చేసుకోవాలని బడాబాబులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించడం.. ఆ ఆక్రమణలను తొలగించడానికి అధికారుల పడిన హైరానా అందరికీ తెలిసిందే. ఇప్పటికే అందులో 5 ఎకరాల స్థలాన్ని రవాణా శాఖ కార్యాలయానికి విక్రయించడం జరిగింది. అప్పుడు 71.17 ఎకరాల స్థలం మాత్రమే అపెరల్‌పార్కుకు ఉంది. 

ప్రణాళిక ప్రకారమే పక్కన పెట్టారు..
వాస్తవానికి అపెరల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం దశాబ్దకాలం గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించకముందు వరకు అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చకచకా పనులు జరిగాయి. ఆయన మరణించాక.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అపెరల్‌ పార్కు అభివృద్ధికి నోచుకోలేదు. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ స్థలం నుంచి 5 ఎకరాలను రవాణాశాఖకు కేటాయించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునే విషయంలో నిర్లప్తత చూపింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ అర్బన్‌ పేరిట ఇళ్ల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని సేకరించాలని భావిస్తోంది. 

ప్రతిపాదించిన మంత్రి నారాయణ.. 
పురపాలకశాఖ మంత్రి నారాయణ అపెరల్‌ పార్కు స్థలంలోని 35 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని ఏపీఐఐసీ చైర్మన్‌కు ప్రతిపాదించారు. అందుకుగాను మరోప్రాంతంలో చేనేతలకు స్థలం కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా రూ. 69 లక్షల చొప్పున ఏపీఐఐసీ ధర నిర్ణయించింది. అయితే దీనిపై చేనేత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చేనేతల అభ్యున్నతి కోసం కేటాయించిన పార్కు స్థలాలను పూర్తిగా వారికి కేటాయించాలంటున్నారు. అపెరల్‌పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో తయారయ్యే వస్త్రాలకు మార్కెటింగ్‌ కల్పించడంతోపాటు పెట్టుబడికి రుణసాయం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆ ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు.. 

చేనేతలను ఆదుకునేందుకే అపెరల్‌ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ స్థలానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మొదటి నుంచి ఏపీఐఐసీనే చూస్తోంది. ఇప్పుడా స్థలంలో ఇంటి నిర్మాణాలకు కేటాయించాలనే ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు. అయితే చేనేతల కోసం కేటాయించిన స్థలాన్ని వారికే కేటాయిస్తాం. అయితే ఏపీఐఐసీకి మా శాఖ నుంచి రూ. 2.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందుకోసం అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించి చెల్లించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
– జయరామయ్య, ఏడీ, చేనేత జౌళి శాఖ

అభివృద్ధి కోసమే వినియోగించాలి
అపెరల్‌ పార్కు స్థలాన్ని చేనేతల అభివృద్ధి కోసమే వినియోగించాలి. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేనేతల దుస్థితిని చూసి 90 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రభుత్వం ఆస్థలాన్ని ఇళ్ల కోసం కేటాయిస్తామని చెప్పడం చేనేతలను అవమానించినట్లే. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఉన్నాడంటే అది చేనేతల పుణ్యమేనని టీడీపీ గుర్తు పెట్టుకోవాలి. మెండిగా ముందుకెళితే మా సత్తా ఏంటో చూపిస్తాం.
– దశరథరామయ్య, చేనేత సంఘ రాష్ట్ర నాయకులు

చేనేతల అభ్యున్నతికి కృషిచేయాలి
చేనేత పరిశ్రమలకే అపెరల్‌ పార్కు స్థలం వాడాలి. కడప జిల్లాలో చిన్నతరహా, భారీ పరిశ్రమలు లేవు. ప్రధానంగా అపెరల్‌పార్కును గార్మెంట్స్‌ సంబంధిత  పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అనుభవజ్ఞులైన కళాకారులు అందుబాటులో లేక పోవడం, పెట్టుబడీ దారులు ముందుకు రాక పోవడంతో చేనేతల అభ్యున్నతి కోసమే 2005లో ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కేటాయించిన స్థలంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు. చేనేతల అభివృద్ధికి కృషి చేయాలి
– అవ్వారు ప్రసాద్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌ 

ప్రభుత్వ నిర్ణయం సరికాదు
చేనేతలను అభివృద్ది చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అపెరల్‌ పార్కు స్థలాన్ని 13 ఏళ్ల కిందట కేటాయించినా ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. చేనేతలు పనులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఆ స్థలాన్ని ఇళ్లకు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తుండటం దారుణం.
    – నాగరాజు, చేనేత కార్మికుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement