
ప్రజా పోలీసింగ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజల్లో చైతన్యం మరింత పెరగాలి. సమగ్ర, సమర్థ పోలీసింగ్‌కు ఇది అవసరం. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజల సహకారం కావాలి. జిల్లా ప్రజల కోసం, శాంతిభద్రతల పరి రక్షణకు సమగ్ర పోలీసింగ్‌ను అభివృద్ధి చేస్తాను. అందుబాటులో ఉన్న సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని, ఉన్న సిబ్బందితోనే జిల్లా ప్రజ ల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తాను.
వ్యక్తిగతం...
మాది గుంటూరు జిల్లా.. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బీఈడీ చదివా. కొన్నాళ్లు రామగుండంలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేశా. తరువాత గ్రూప్-1 రాసి 1991లో డీఎస్పీగా ఎంపికయ్యా. గతంలో మూడేళ్ల పాటు శ్రీకాకుళం జిల్లాలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా పనిచేశా. అందువల్ల జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. తొలిసారి శాంతిభద్రతల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ గతంలోనే జిల్లాలో అనువణువూ తిరగా. ఆ అనుభవం ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా చేస్తా. జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.
జిల్లా ప్రజల గురించి..
శ్రీకాకుళం ప్రజలు మంచి హృదయం ఉన్నవాళ్లు. శ్రీకాకుళం జిల్లా స్పూర్తిదాయకం. ఎన్ని కష్టాలైనా తట్టుకొని.. ఎంతైనా దూరమైనా వెళ్లి బతకగలరు. కష్టపడటం ఇక్కడివారి మనస్తత్వం. కోడి రామ్మూర్తి వంటి మహానుభావులు పుట్టిన ఈ గడ్డలో.. పోరాటాలకు నెలవైన ఈ ప్రాంతంలో.. ఎంతోమంది చరిత్రకారులకు పుట్టినిల్లయిన శ్రీకాకుళంలో ఎస్పీగా పోస్టింగ్ రావడం సంతోషంగా ఉంది.
మెరుగైన కంట్రోల్ రూం
జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలిసేలా కంట్రోల్ రూంలున్నాయి. అయితే ఇటీవల డయల్ 100గా దీనిని మార్చి రాజధానిలోని ఉన్నతాధికారులకే నేరుగా అనుసంధానం చేశారు. దీనివల్ల సత్వరం అధికారులకు సమాచారం అందడంతోపాటు, క్షణాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వీలుంటుంది. దీనికి మరింత మెరుగులు దిద్ది ఇక్కడి కంట్రోల్ రూమును బలోపేతం చేస్తాం. మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేసేలా.. ముగ్గురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు పర్యవేక్షలుగా ఉంటారు. రోజువారీ (డీఎస్సార్) నివేదికలు ఉన్నతాధికారి వద్దకే వచ్చేలా చర్యలు చేపడతాం. దీనివల్ల మరింత పారదర్శకమైన, మెరుగైన పోలీసింగ్ సాధ్యమవుతుంది.
అన్ని పోలీస్ స్టేషన్లకూ రిసెప్షన్ కేంద్రాలు
ప్రజల్లో పోలీసుల పట్ల, పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరగాలి. పోలీసులంటే భయం పోవాలి. ఫిర్యాదు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకు రావాలి. గతంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటేనే ఓ రకమైన భయం ఉండేది. ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. ఇంకా మారాలి. పోలీసులు కూడా మన కుటుంబ సభ్యులే అన్న భావన రావాలి. ఇందుకోసం జిల్లాలో తొలిదశలో ఆమదాలవలస, వీరఘట్టం, సారవకోట, మెళియాపుట్టి, కాశీబుగ్గ, సంతబొమ్మాళి మండల కేంద్రాల్లో మహిళా రిసెప్షన్ కేంద్రాల నిర్మాణానికి అనుమతులొచ్చాయి. ఇప్పటికే మూడు కేంద్రాల్లో భవనాలు తయారవుతున్నాయి. త్వరలో జిల్లా వ్యాప్తంగా ఈ తరహా భవనాలొస్తాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉండే ఈ రిసెప్షన్ కేంద్రాల్లో అధికారుల ఫోన్ నెంబర్లు, ఫిర్యాదు ఏ విధంగా చేయాలి, ఎవరిని కలవాలన్న వివరాలు ఫిర్యాదుదారులకు తెలియజేసేందుకు వీలుగా మహిళా కానిస్టేబుళ్లు అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటారు. వచ్చిన వారు కూర్చునేందుకు, ఫిర్యాదు రాసుకునేందుకు, ప్రశాంత వాతావరణంలో తమ బాధలు చెప్పుకునేందుకు వీలుగా ఈ సెంటర్లుంటాయి.
హైవే పెట్రోలింగ్.. బీట్ వ్యవస్థ పటిష్టత
జాతీయ రహదారిపై చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో హైవే పెట్రోలింగ్, బీట్ల వ్యవస్థను మరింత పటి ష్టం చేసేందుకు నిర్ణయించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ ప్రభుత్వ విభాగాల సహకారంతో ముందస్తు భద్రతా చర్యలు చేపడతాం. బీట్ల వ్యవస్థను పరిపుష్టం చేసి ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుం టాం. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. గత ఏడాది జిల్లాలో 8 ప్రత్యేక పోలీస్ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో మహిళా పోలీస్‌స్టేషన్, సీసీఎస్, ట్రాఫిక్ స్టేషన్లు సిద్ధం కాగా, త్వర లో ఎచ్చెర్ల, సారవకోట, నౌపడా, నరసన్నపేట, ఇచ్చాపురం ప్రాంతాల్లో త్వరలో కొత్త భవనాలు కూడా రానున్నాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల ప్రాం తాల్లో రెండు కొత్త బ్యారెక్‌లుసిద్ధం కాగా కాశీ బుగ్గ, కోటబొమ్మాళి ప్రాంతాల్లో కొత్త భవనాలు నిర్మించేందుకు సిబ్బంది పనులు చేపట్టారు.
కేసుల మానిటరింగ్ సెల్
కోర్టుల్లో ఉన్న కేసుల్ని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా త్వరలో ఎస్పీ కార్యాలయం మేడపైనే కొత్తగా ‘కోర్టు మానిటరింగ్ సెల్’ రానుంది. ఇందులో ఓ ప్రత్యేక అధికారి తన సిబ్బందితో విధులు నిర్వహిస్తారు. కోర్టు కేసుల తేదీలను అధికారులు, నిందితులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం, ఫైళ్లు పకడ్బందీగా నిర్వహించడం ఈ విభాగం విధి. ఉన్నతాధికారులతో సమాచారం పంచుకుంటూ, ప్రతి కేసుపైనా ప్రత్యేక నివేదికలు తయారు చేస్తూ, కేసు ల్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు వీలు గా ఈ సెల్ పనిచేస్తుంది. ఆన్‌లైన్ సమాచారాన్ని పొందుపరుస్తూ జిల్లాలో ఎక్కడ ఏ కేసు నమోదైనా, దాని వివరాలు క్షణాల్లో ఇక్కడకు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ప్రజలకు పోలీసులంటే ప్రత్యేక గౌరవం లభించేలా, అందరి సహకారంతో మరింత పకడ్బందీగా పోలీస్‌వ్యవస్థ పనిచేస్తుందని కచ్చితంగా చెప్పగలం.