సాక్షి, విజయవాడ : కృష్ణాడెల్టా రైతాంగం కలలు సాకారమయ్యే రోజులు సమీపిస్తున్నాయి. వచ్చే సంవత్సరంలో వేసవిలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ఆదుకుని ఆ తర్వాత నీటిని నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణలోని నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న నాలుగు ముంపు గ్రామాలకు సంబంధించి అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులతో మన రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుతం10.15 టీఎంసీల నీరు నిల్వ
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో జల విద్యుత్‌కు ఉపయోగించిన నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం వద్ద ప్రస్తుతం 860 అడుగుల నీరు నిల్వ ఉంది. కానీ, 854 అడుగులకు నీటి మట్టం తగ్గితే ప్రమాదఘంటికలు మోగుతాయి. కృష్ణా డెల్టాకు వచ్చే ఏడాది తాగు నీరు కూడా లభించే అవకాశం ఉండదు.
ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో ఆంధ్రా ప్రజల బాధలను పట్టించుకోకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కిందకు నీటిని వదులు తున్నారు. దీంతో కిందకు వస్తున్న నీటిలో 10.15 టీఎంసీల నీటిని సోమవారం వరకు పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసినట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. మరో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దీని వల్ల వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కృష్ణా డెల్టా ప్రజల దాహార్తిని తీర్చవచ్చని చెప్పారు.
ముంపు గ్రామాలకు నిధులు
ప్రస్తుతం ఉన్నదానికన్నా ఎక్కువ నీరు నిల్వ చేస్తే నల్లగొండ జిల్లాలోని అడ్లూరు, వెల్లటూరు, కృష్ణపురం, చింప్రియాల, గుంటూరు జిల్లాలోని కొల్లూరు, గొల్లపేట గ్రామాలు నీట మునిగిపోతాయి. అడ్లూరు, వెల్లటూరు, కృష్ణపురం, చింప్రియాల గ్రామాల బాధితులకు నష్ట పరిహారం కోసం ఇప్పటికే రూ.20 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి మన రాష్ట్ర తరఫున అందజేశారు. అయితే తెంగాణ సర్కారు మరో రూ.40 కోట్లు కోరినట్లు తెలిసింది. ఈ నిధులు కూడా మరో 15 రోజుల్లో చెల్లించి 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మంత్రి ఉమా, ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పులిచింతలలో 20టీఎంసీల నీటి నిల్వకు కసరత్తు
Published Wed, Oct 22 2014 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM
Advertisement
Advertisement