
మాతృత్వానికి మచ్చ
స్థానిక రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై ఆరు నెలల పసికందు(ఆడశిశువు)ను గుర్తుతెలియని కొందరు ఆదివారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో వదిలి వెళ్లారు. ప్లాట్‌ఫాంపై పసికందు ఏడుపు వినిపించడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.
చీరాల రైల్వేస్టేషన్‌లో ఆరు నెలల చిన్నారి
ఐసీడీఎస్‌కు అప్పగించిన రైల్వే పోలీసులు
‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా..! అని తల్లి-బిడ్డ మధ్య ఉండే ప్రేమానురాగాలను ఓ సినీ కవి తన పాటలో అందంగా వర్ణించారు. దేవునికి ప్రతిరూపం అమ్మ.. అని భావించే సమాజంలో ఓ తల్లి తన పేగు తెంచుకు పుట్టిన పసికందును వదిలించుకుంది. మరి ఆ తల్లికి వచ్చిన కష్టం ఏమిటో తెలి యదుగానీ ఎవరూ చూడకుండా రైల్వేస్టేషన్‌లో తన ఆరు నెలల బిడ్డను ఉంచి మాయమైంది. ఈ సంఘటన చీరాల రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం జరిగింది.
చీరాల అర్బన్, న్యూస్‌లైన్ :
స్థానిక రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై ఆరు నెలల పసికందు(ఆడశిశువు)ను గుర్తుతెలియని కొందరు ఆదివారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో వదిలి వెళ్లారు. ప్లాట్‌ఫాంపై పసికందు ఏడుపు వినిపించడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఉండాల్సిన బాలిక వద్ద ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల విచారించారు. అనంతరం విషయాన్ని జీఆర్పీ ఎస్సై అశోక్‌బాబుకు తెలియజేశారు. కొద్దిసేపటి తర్వాత ఐసీడీఎస్‌కు సంబంధించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు పసికందును రైల్వే పోలీసులు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం శిశువును ఒంగోలు ఐసీపీఎస్‌కు తరలిస్తామని ఐసీడీఎస్ సిబ్బంది తెలిపారు. పసికందు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై ఒంటరిగా ఉండటాన్ని ప్రయాణికులు చూసి చలించిపోయారు.
కొందరు మహిళలు దగ్గరకు వెళ్లి చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఏ తల్లి కన్న బిడ్డో ఇలా ఒంటరైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు లేక ఎందరో మహిళలు నోములు నోస్తుంటే పుట్టిన బిడ్డను ఇలా వదిలి వెళ్లడంపై అక్కడి వారిని కలచి వేసింది. నెలల శిశువును అనాథగా వదిలి వెళ్లిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందోనని మహిళలు విచారం వ్యక్తం చేశారు.