
'నంద్యాల ఉప ఎన్నిక రద్దు చేయాలి'
నంద్యాల ఉప ఎన్నికతో రాష్ట్రంలో పాలన పడకేసిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు.
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికతో రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేసిందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాలలో ఎన్నికలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత లాభం కోసమే చంద్రబాబు, జగన్.. ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తున్నారని ఆరోపించారు. దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.